ఛండీఘడ్, అక్టోబరు 9,
పార్లమెంటు ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్రమైన అంతర్మథనం లో పడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలను ప్రకటించాయి అయితే వీటన్నింటిని పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి త్వరగా కోలుకుంది. వేగంగా పుంజుకుని అధికారాన్ని దక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సామాజిక ఇంజనీరింగ్ నుంచి ఎన్నికల వ్యూహాల వరకు.. అన్నింటికీ పదును పెట్టి.. తిరుగులేని స్థాయిలో నిలిచింది. ముఖ్యంగా మోడీ – షా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రకటైనా పరిశీలించారు. పార్టీని ముందుండి నడిపించారు. అందువల్లే అంచనాలను మించి బిజెపి హర్యానాలో గెలిచింది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలో బిజెపికి సీట్లు తగ్గాయి. దీనిని ఇలాగే ఉపేక్షిస్తే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని అధినాయకత్వం భావించింది. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుపెడితే కుల సమీకరణాల వరకు భారీ కసరత్తు చేసింది. జాతీయ పార్టీ నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులు కలిసి హర్యానా ఎన్నికల్లో పనిచేశారు. వాస్తవానికి సర్వే రిపోర్టులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం కమలానికి జై కొట్టడం విశేషం.ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కుల సమీకరణల విషయంలో పకడ్బందీ విధానాలను అవలంబించింది..జాట్ వర్గాన్ని తన వైపు తిప్పుకుంది. రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఓబీసీ వర్గాన్ని మచ్చిక చేసుకుంది. ఈ బాధ్యతను నాయబ్ సింగ్ షైనీ కి అప్పగించింది. దీంతో ఆ రాష్ట్రంలో జాట్ వర్సెస్ ఇతరులు అనే తీరుగా పోరాటం సాగింది. ఆ పోరాటంలో బిజెపి అత్యద్భుతంగా పై చెయ్యి సాధించింది. దళితుల్లో బలమైన జాటవ్ లు వెళ్ళినప్పటికీ.. మిగిలిన కులాల ఓట్లను బిజెపి దక్కించుకుంది. ఇక పంజాబీలు అగ్రకులాల ఓట్లు దక్కించుకోవడం కోసం బ్రాహ్మణ వర్గానికి చెందిన మోహన్లాల్ బదోలికి బిజెపి కీలక బాధ్యతలు అప్పగించింది. హర్యానా రాష్ట్రంలో పై వర్గాల ఓట్లు 7.5% వరకు ఉంటాయి. దీంతో 11 స్థానాలను ఈ వర్గానికి బిజెపి కేటాయించింది. హర్యానా రాష్ట్రంలో అగ్రకులాల వారు, పంజాబీలు దేశ విభజన తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వారంతా కూడా గ్రాండ్ ట్రంక్ రోడ్డు మార్గంలోని అర్బన్ నియోజకవర్గాలలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వీరు భారతీయ జనతా పార్టీకి ప్రధాన బలంగా నిలిచారు. అందువల్లే బిజెపి ఇక్కడ గెలవగలిగింది. మరోవైపు కాంగ్రెస్ జాట్ – దళిత కూటమిని ఏర్పాటు చేసింది. బిజెపి యాంటీ జాట్ కూటమిని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ తన వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది. బిజెపి దూకుడు వల్ల జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. అర్బన్ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది. ఫలితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటనను వాయిదా వేసింది . అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది.