హైదరాబాద్, అక్టోబరు 9,
రాత్రికి రాత్రే ఏ అద్భుతమూ జరగదు. ఎవరి చేతుల్లోనూ అల్లావుద్దీన్ అద్భుత దీపం అంతకంటే లేదు. ఉన్నదల్లా సంకల్ప బలమే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అదే సంకల్పంతో ఉన్నారు. రాజకీయంగా కాస్త నష్టమైనా సరే.. కోటి మందికి పైగా ఉండే హైదరాబాదీల కోసం, నల్గొండ ప్రజల కోసం మూసీకి మహర్దశ తీసుకొస్తానంటున్నారు. అందరి ముసుగులు తొలగిస్తానంటున్నారు.సబర్మతి విషయంలో మోడీ, థేమ్స్ విషయంలో ఇంగ్లండ్ పాలకుల సంకల్పానికి నిదర్శనంగా అవిప్పుడు వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్లుగా మారాయి. పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. ఒకసారి మన మూసీ నది దగ్గరికి వద్దాం. మూసీ అలాగే ఉండాలి.. ఎవరినీ ఇక్కడి నుంచి తరలించొద్దు. పేదల ఇండ్లు కూల్చొద్దు. ఇదీ ప్రధాన ప్రతిపక్షం వాదన. ఒకప్పుడు మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అని మాట్లాడిన వాళ్లే ఇప్పుడు అడ్డుపడుతున్న పరిస్థితి. మూసీ కంపు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా అన్నది సగటు హైదరాబాదీ ప్రశ్న.నగరం నడిబొడ్డు నుంచి మూసీ ప్రవహిస్తుంది. మొత్తం దుర్వాసనే. ఎటు చూసినా కాలుష్యమే. పైగా ఆక్రమణలు. ఇలాగే నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తే ఇదే కాలుష్య నీటిని అక్కడ తాగడానికి, పంటలు పండించడానికి వాడుతున్నారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మూసీ నది ఒక శాపంగా మారొద్దంటే ప్రక్షాళన జరగాల్సిందే అంటున్నారు. కానీ విపక్షాల రూటు మాత్రం మరోలా ఉందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఇండ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నారు. తరలించడానికి ఖర్చులు కూడా ఇచ్చి తీసుకెళ్తున్నారు. కానీ ఇవేవీ కనిపించడం లేదా అన్న ప్రశ్నలున్నాయి. సరే ఉన్నఫళంగా ఖాళీ చేయాలంటే కష్టమే. వారిని సముదాయిస్తున్నారు.హైదరాబాద్ అంటే పెరల్ సిటీ. అంటే ముత్యాలనగరం అని పేరు. కానీ తొలిసారి సిటీకి ఎవరైనా వచ్చి మూసీ చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. 1591లో ఏర్పాటైన ఈ నగరం చారిత్రక ఖ్యాతి సంపాదించుకుంది. కానీ నగరీకరణ పెరగడం, మూసీ ఆక్రమణలు, దశాబ్దాల నిర్లక్ష్యంతో మూసీ పూర్వ వైభవం కోల్పోయింది. కానీ దీన్ని మార్చాలని సీఎం రేవంత్ చాలా సంకల్పం తీసుకున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకే అంటున్నారు.మూసీ ప్రక్షాళన వద్దు అనే వాళ్లంతా ఫాంహౌజ్ లు కట్టుకుని అడ్డుకుంటున్న వారే అంటున్నారు. ముసుగులు తొడుక్కున్న వారిని బయటకు తీసుకొస్తామంటున్నారు సీఎం. రాజకీయంగా నష్టం ఉంటుందని అంచనా వేయలేనా అని ప్రశ్నించారు. ఒక అద్భుతం జరగాలంటే చాలా జరగాలి. నిజానికి మూసీ పరివాహక ప్రజలను తరలించవద్దు అంటున్న పార్టీలు పేదలకు ఏం చేయాలో ఎందుకు చెప్పలేకపోతున్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయని అక్కడికి తరలిద్దామన్న ప్రతిపాదన తెచ్చారు సీఎం రేవంత్. అంతే కాదు.. కేంద్రం దగ్గరికి వెళ్లి నిధులు తీసుకొచ్చే విషయంలో ముందుకొస్తారా అని బీజేపీని ప్రశ్నించారు. ఎందుకంటే సబర్మతి కల సాకారమైనప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకు కాదు అన్నదే సీఎం చెప్పాలనుకుంటున్న పాయింట్.నిజానికి మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో ఇంత సీరియస్ గా ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. ఇందులో మతలబు ఉందని, మూసీ వెనుక కథలు చాలా ఉన్నాయని, డబ్బులు నొక్కే కార్యక్రమమంటూ విపక్షాలు అంటున్నాయి. ఒకసారి సబర్మతి, థేమ్స్ నది చూసిన వారు ఈ మాట అనరు అని అంటున్నారు. మూసీ విషయంలో రాజకీయంగా కొంత నష్టం జరిగే పరిస్థితి ఉన్నా సీఎం రేవంత్ ముందుకు వెళ్తుండడానికి కారణాలు ఉన్నాయి. మూసీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన జరగదు. సంఘర్షణ ఎలా ఉన్నా ముందుకే అంటున్నారు.ప్రస్తుతం మూసీ ప్రక్షాళన నేపథ్యంలో మనకు వినిపిస్తున్న పేర్లు సబర్మతి, థేమ్స్. ఈ రెండింటినీ సీఎం రేవంత్ సహా చాలా మంది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. అయితే అక్కడ ఏం చేస్తే ఆ రెండు నదులు బాగుపడ్డాయో ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేయబోతున్నాం. ఒక దశలో మురికి కూపంగా మారి, జీవం కోల్పోయి ఇక ఎందుకూ పనికి రాదు అనుకున్న సమయాల్లో అద్భుతాలు ఎలా జరిగాయో చూద్దాం. ఆ నదులకు రాజయోగం పట్టి., మహర్దశ రావడానికి ఎన్నెన్ని సంఘర్షణలు జరిగాయో చూపిస్తాం. పాలకుల గట్టి సంకల్పం ద్వారా సాధ్యమైందో తెలుసుకుందాం. మూసీని ఇప్పుడు బాగు చేద్దామనుకుంటే ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో అందరూ చూస్తున్నదే. కానీ సబర్మతి, థేమ్స్ నదుల తలరాత ఎలా మారిందో చూస్తే అందరి కళ్లు తెరుచుకోవడం ఖాయం.సీఎం రేవంత్ పదే పదే సబర్మతి గురించి చెబుతున్నారు. అదే విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారని అంతా అనుకోవచ్చు. కానీ అది తెలుసుకోవడం అందరి బాధ్యత కూడా. అహ్మదాబాద్ మధ్యగా ప్రవహించే సబర్మతి నది. ఒక్కప్పుడు అచ్చం మన మూసీ నది మాదిరిగానే ఉండేది. మన హైదరాబాద్ లో ఎలాగైతే మూసీ మధ్య నుంచి ప్రవహిస్తుందో అలాగే అక్కడ కూడా. కానీ సబర్మతి దశ మాత్రం తిరిగిపోయింది. కాదు కాదు దశ తిప్పేశారు. సంకల్పం గట్టిదైతే పని జరుగుతుంది. మోడీ అనుకున్నారు. సబర్మతిని అందమైన నదిగా మార్చేశారు. మన దగ్గర కూడా మూసీ నది దశ మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. నదితో పని ఏముంది. ఏం వస్తుంది అనుకోవద్దు. జల వనరుల చుట్టూనే నాగరికత ఉంటుంది. పల్లెలైనా, పట్టణాలైనా, నగరాలైనా ఏదో ఒక నది, చెరువు ఆదరువుగా ఏర్పడ్డవే, విస్తరించినవే. నీటిని, పర్యావరణాన్ని వేరు చేసి చూడలేం. అందుకే అంత ప్రాధాన్యం. ఇదే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం.ఒకసారి సబర్మతి దగ్గరికి వెళ్దాం. మన మూసీ మాదిరే ఆ నది కూడా ఒక దశలో మురికికూపంగా మారిపోయింది. జీవం కోల్పోయింది. చుట్టూ అపరిశుభ్రత, చెత్త వాతావరణం. వీటికి తోడు ఆక్రమణలు. మురుగునీటి వ్యర్థాలు. ఒక్కటేమిటి ఇప్పుడు మన మూసీ ఉన్నట్లుగానే సబర్మతి కూడా ఉండేది. నదికి నగరానికి లింక్ తొలగిపోతే ఎలా ఉంటుందో.. ఒకప్పుడు సబర్మతి చూస్తే అర్థమవుతుంది. నీళ్లు లేక క్రికెట్ గ్రౌండ్ గా, సర్కస్ లకు వేదికగా అయింది సబర్మతి. అలాంటి దశ నుంచి మొత్తం కథ మార్చేశారు మోడీ. సబర్మతి రివర్ ఫ్రంట్ ఒక సంకల్పంతో మొదలైంది. మొదట్లో అది పగటి కలే అనుకున్నారంతా. ఒక అడుగు ముందుకు పడితే మూడడుగులు వెనక్కు పడుతుందన్నారు. అయ్యేది కాదు పోయేది కాదన్నారు. కానీ అసాధ్యం సుసాధ్యమైంది. సబర్మతి రివర్ ఫ్రంట్.. కథ 1990ల నాటిది. 1997లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. సబర్మతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన పట్టణ ప్రణాళిక ప్రాజెక్ట్‌గా దీన్ని రూపొందించాలని ఆయన కలలు కన్నారు. అయితే అనుకున్న వెంటనే ఇంత పెద్ద పని ఏదీ జరగదు కదా. అందరినీ ఒప్పించాలి. మెప్పించాలి. తరలించాలి. ఎంతో సంఘర్షణ.. ఇవన్నీ జరిగాయి. 2005 వరకూ ఇవే గొడవలు. సమస్యలు. కానీ 2005లో మాత్రం నిర్మాణాలు మొదలయ్యాయి. ఆక్రమణలు తొలగింపు మొదలు చేసిన పనులతో 2012 నాటికి సబర్మతికి ఒక రూపు వచ్చింది. వాటర్ ఫ్రంట్ సహా బ్యూటిఫికేషన్, గ్రీనరీ, చుట్టూ పార్కులు ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 2012లోనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సబర్మతీ తీరంలోనే మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడంతో అంతర్జాతీయంగా టూరిజం మ్యాప్ లోకి ఈ నది వచ్చింది. మారిన సబర్మతి ఎలా ఉందో బాహ్య ప్రపంచమంతా చూసింది. ఇక సెప్టెంబర్ 17, 2014న చైనా అధ్యక్షుడి జిన్ పింగ్ సతీసమేతంగా సబర్మతి రివర్ ఫ్రంట్ ను చూసి అద్భుతమన్నారు.పర్యావరణ మెరుగుదల, సామాజిక మౌలిక సదుపాయాలు అలాగే స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా సబర్మతి రివర్ ఫ్రంట్ జనానికి అందుబాటులోకి వచ్చింది. నదికి రెండువైపులా గోడలు ఏర్పాటు చేశారు. వరదలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా తీర్చిదిద్దారు. అలాగే మురికి నీళ్లు, పారిశ్రామిక వ్యర్థాలు సబర్మతిలో కలవకుండా కొత్త సీవేజ్ ట్రీట్మెంట్ అలాగే, వరదనీటి ప్రవాహం కోసం మరిన్ని ఏర్పాటు చేశారు. దీంతో మురికి నుంచి సబర్మతికి విముక్తి కలిగింది. సబర్మతి రివర్ ఫ్రంట్ కల సాధ్యం చేయడానికి ఆక్రమణలకు గురైన 501 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న భూమిలో 85 శాతం లాండ్ ను ప్రజలకు మౌలిక సదుపాయాలు, వాకింగ్ ట్రాక్, పార్కులు వంటివి వాటికి కేటాయించారు. మరో 15 శాతం వాణిజ్య అవసరాలకు ఇచ్చారు. భూమి స్వాధీనం సమయంలో మూసీ మాదిరిగానే చాలా శక్తులు అడ్డు పడ్డాయి. కానీ వాటిని అధిగమించారు.ఆగస్టు 2022లో రివర్‌ఫ్రంట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా పాదచారుల కోసం అటల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జితో నది మధ్యలో నిలబడి నీటి ప్రవాహాన్ని చూసేలా తీర్చి దిద్దారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సైక్లిస్టులు కూడా ఈ బ్రిడ్జిని ఉపయోగించుకుంటున్నారు. ఇవే కాదు సబర్మతి చుట్టూ రివర్ ఫ్రంట్ మార్కెట్, లాండ్రీ క్యాంపస్ వంటివి తెచ్చారు. వెండింగ్ ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేయించారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు ఎస్‌ఆర్‌ఎఫ్‌డీ ప్రాజెక్టు ద్వారా లక్ష మొక్కలు నాటారు. బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రణాళికలతో ఎయిర్ పోర్టుకు అహ్మదాబాద్ లో ఒకచోటి నుంచి మరో చోటికి ఈజీగా వెళ్లేలా తీర్చి దిద్దారు.సబర్మతి రివర్ ఫ్రంట్ 120 కంటే ఎక్కువ స్థానిక అలాగే వలస, అరుదైన పక్షి జాతులకు ఆలవాలంగా మారింది. 45 వేల చెట్లు ఉన్నాయి. 11 కిలోమీటర్ల మేర పాదచారుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏ వెహికిల్ వచ్చి ఢీకొంటుందో అన్న టెన్షన్ లేదు. సబర్మతీ తీరానికి వెళ్తే నగరవాసికి చాలా రిలీఫ్ వచ్చేలా తీర్చి దిద్దారు. ఆధునిక భారతదేశంలో పట్టణ ప్రణాళిక, అభివృద్ధి హిస్టరీలో ఒక సక్సెస్ ఫుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే అది సబర్మతి రివర్ ఫ్రంట్ మాత్రమే. అలాగే లండన్ థేమ్స్ నది కూడా ఇలాగే కొత్త రూపు సంతరించుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ నది ఒకప్పుడు మురికి కూపంగా ఉండేది. పారిశ్రామికీకరణ ఊపందుకోవడం, నగర జనాభా పెరిగిపోవడంతో ఇంగ్లండ్ పట్టణాల మీదుగా ప్రవహించే థేమ్స్ నదిలో వ్యర్థాలు కలవడం పెరిగిపోయాయి. 1850ల్లో అయితే థేమ్స్ ఒడ్డున నిలబడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకటే కంపు. ఇప్పుడు మన మూసీ ఉన్నట్లు.కానీ దాని సంకల్ప బలంతో దాని కథను మార్చేశారు పాలకులు సో అటు సబర్మతి, ఇటు థేమ్స్ ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూశాక, ఆ నదులు ఇప్పుడు కళకళలాడుతున్న దృశ్యాలు చూశాక మూసీ మారడమా వద్దా అన్నది హైదరాబాదీలే నిర్ణయించుకోవాలి.