హైదరాబాద్, అక్టోబరు 10,
తెలంగాణలో త్వరలోనే టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ DSC ప్రక్రియ దాదాపు పూర్తి కాగా...వచ్చే నెలలో మరోసారి టెట్ ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. జనవరిలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంటుంది.
త్వరలోనే టెట్, డీఎస్సీ నోటిపికేషన్!
విద్యాశాఖలోని టీచర్ల ఖాళీలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. వీరందరికీ నియామకపత్రాలను కూడా అందజేయనున్నారు. త్వరలోనే పని చేసే ప్రాంతాలను కూడా ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉంటే… మరికొన్ని ఖాళీలను గుర్తించి… వాటిని కూడా భర్తీ చేయాలని సర్కార్ భావిస్తోంది.కొద్ది నెలల కిందట అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు నెలలను కూడా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇక్కడ చూద్దాం….
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ - ముఖ్యమైన అంశాలు:
విద్యాశాఖలోని మరికొన్ని టీచర్ ఖాళీల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో ఏమైనా ఖాళీలు ఉంటే… వాటిని కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం… వచ్చే నెల(నవంబర్)లో టెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది.
టెట్ రాత పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 2025లో ఇస్తారు.
అప్లికేషన్ల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 2025లో పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ తర్వాత ఏప్రిల్ నెలలోనే మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
మరోవైపు ఈ ఏడాది ఇచ్చిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వీరంతా త్వరలోనే విధుల్లో చేరనున్నారు. వీరి పోస్టింగులకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు షురూ చేసింది. దసరా తర్వాత వీరంతా విధుల్లో చేరుతారు. ఇక ఈ నోటిఫికేషన్ లో 1056 టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్‌పడింది. కోర్టు కేసుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పోస్టుల విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.