అమరావతి
ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లో నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుంది. నారా రోహిత్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షనమైన సినిమాలు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాణం సినిమాతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకుడు. ఆ తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తినాయుడి రెండో కుమారుడు రోహిత్. రోహిత్ కు శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వీరు వివాహానికి దూరంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జోక్యం చేసుకొని రోహిత్ కు సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈనెల 13వ తేదీన హైదరాబాద్ లో నిశ్చితార్థం జరగబోతోంది.
చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. తదితర కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు. వధువు ఎవరనే విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ ప్రతినిధి2 సినిమాలో రోహిత్ పక్కన హీరోయిన్ గా నటించిన సిరి లేళ్ల అని తెలుస్తోంది. నారావారి కుటుంబం నుంచి కానీ, నందమూరివారి కుటుంబం నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే సెలబ్రిటీలంతా రోహిత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.