YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సిద్ధిఖి హత్య వెనుక...

సిద్ధిఖి హత్య వెనుక...

ముంబై, అక్టోబరు 14,
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సిద్ధిఖి తన కుమారుడి కార్యాలయం ఎదుట నవరాత్రుల సందర్భంగా టపాసులు కాల్చుతున్నారు. ఆయనకు సమీపంలోనే భద్రత సిబ్బంది ఉన్నారు. ఆయన టపాసులు కాల్చుతుండగా.. వారు ఆ దృశ్యాలను చూస్తూ ఆనందిస్తున్నారు. అందరూ కేరింతలు కొడుతుండగా.. ముగ్గురు వ్యక్తులు అత్యంత వేగంగా ద్విచక్ర వాహనాలపై వచ్చారు. సినిమాల్లో మాదిరిగానే అత్యంత సమీపం నుంచి తుపాకుల ద్వారా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిఖి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఒంట్లో నుంచి రక్తస్రావం తీవ్రంగా జరిగింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. అయితే ఈ ఘటనలో హర్యానా రాష్ట్రానికి చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వారమని ఆ నిందితులు ప్రకటించారు. అయితే మూడో నిందితుడు శివకుమార్ ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.సిద్దిఖి ని హత్య చేయడానికి నిందితులు కొద్ది నెలలుగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సంబంధించి చర్చలు జరుపుతూ.. సిద్ధిఖి నివాసం, కార్యాలయంపై తీవ్రంగా నిఘా పెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్ధిఖిని హత్య చేసేందుకు నిందితులకు లారెన్స్ గ్యాంగ్ 50 వేల చొప్పున ముందస్తుగా చెల్లించిందని.. పార్సిల్ విధానంలో మారణాయుధాలను సరఫరా చేసిందని తెలుస్తోంది. ఇక ఇదే ఏడాది ఏప్రిల్ నెలలో లారెన్స్ గ్యాంగ్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పులు జరిపింది. సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పులు జరపడంతో కలకలం నెలకొంది. ఆ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని సల్మాన్ ఖాన్ కు హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే లారెన్స్ గ్యాంగ్ రెచ్చిపోయింది. సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్ధిఖిని హతమార్చింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద.. ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది. సిద్ధిఖి మరణ వార్త వినగానే సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూట్ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చారు.. సిద్ధిఖి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన తర్వాత లారెన్స్ గ్యాంగ్ లో ముఖ్యుడు అన్మోల్ కీలక ప్రకటన చేశాడు.. ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందు ఉందని సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానించాడు.

Related Posts