అమరావతి, అక్టోబరు 16,
ఒకరేమో సీఎం.. మరొకరేమో డిప్యూటీ సీఎం.. వారిద్దరి లక్ష్యం ప్రజాసంక్షేమ పాలన సాగించడమే. అయితే ఒకరిది సుధీర్ఘ రాజకీయ చరిత్ర.. మరొకరిది అందుకు భిన్నమైనా ఊహించని రీతిలో రాజకీయ రంగప్రవేశం చేసి, సక్సెస్ అయ్యారు. అంతవరకు ఓకే కానీ.. అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంగా ప్రజల మన్ననలు పొందడమే కాక, ఏకంగా పల్లెలను అభివృద్ది బాటలో పయనింపజేసేందుకు భారీ ప్రణాళిక రూపొందించారు ఆయన. అందుకు సీఎంగా సుధీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంతకు అభినందించిన సీఎం చంద్రబాబు అయితే.. అభినందనలు అందుకున్న వారు ఎవరో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా.. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. పాలనా పరమైన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ అనతికాలంలోనే పట్టు సాధించారు. అంతేకాదు తనకు అప్పగించిన అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై పూర్తి అవగాహనతో అడుగులు వేస్తున్నారు పవన్. అందుకే కాబోలు తొలుత విస్తృత సమావేశాలు నిర్వహించి, తన శాఖల స్థితిగతులు అన్నీ తెలుసుకున్నారు. ఇక మంత్రిగా రంగంలోకి దిగిన తొలిసారే.. రాష్ట్రవ్యాప్త పల్లెపండుగకు పవన్ పిలుపునిచ్చారు. ఈనెల 14 నుండి 20వతేదీ వరకు అన్ని పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.పండుగ అంటే మామూలు పండుగ కాదు వేల కోట్ల రూపాయలతో గ్రామాల అభివృద్ది బాటకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పల్లె పండుగ అన్ని గ్రామాలలో విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 13,326 గ్రామాలలో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పంతో రూ.4,500 కోట్లు ఖర్చు చేసి.. పల్లెలకు వెలుగులు నింపనున్నారు. అంతేకాదు జాబ్ కార్డు ఉన్న ఏ ఉపాధి హామీ కూలీ కూడా ఖాళీగా ఉండరాదన్నది కూడా పవన్ లక్ష్యం. అందుకే గ్రామసభలు నిర్వహిస్తూ.. ఎక్కడికక్కడ అభివృద్ది ప్రణాళికలు కూడా సిద్దం చేస్తున్నారు అధికారులు.ఇలా పవన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతంగా సాగుతోంది. అంతే ప్రజా స్పందన కూడా వస్తోంది. అందుకే కాబోలు సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటన విడుదల చేశారు. పవన్ ను అభినందిస్తూ.. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నానంటూ చంద్రబాబు ప్రకటించారు. అయితే పవన్ మాత్రం తన సినిమా డైలాగ్ మాదిరిగా.. తగ్గేదెలే అంటూ తనదైన స్టైల్ లో పాలనా అంశాలపై దృష్టి సారించి దూసుకుపోతున్నారు.