అమరావతి, అక్టోబరు 18,
అమరావతిలో నిర్మాణ పనులు పునః ప్రారంభించి పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఏడు అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. నిర్మాణాలు పునః ప్రారంభించిన తర్వాత అన్నింటికీ ఓ కాలపరిమితితో ముందుకెళ్లాలని నిర్ణయించారు.సీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం అథారిటీ అకౌంట్స్‌ను ఏటా జులై 31లోగా అకౌంటెంట్ జనరల్‌కు ఇవ్వాలి. 2014 నుంచి 2017 సంబంధించిన రిపోర్ట్‌లను 2018లోనే ఏజీకి సమర్పించారు. 2017-18 నుంచి ఆడిటింగ్ జరగలేదు. 2017-18, 2018-19, 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ ఏజీ ఇవ్వాలని తీర్మానం చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టే నిర్మాణాలకు సామాజిక, పర్యావరణ అనుమతులు అవసరం అవుతాయి. కేంద్ర,రాష్ట్ర, స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు,ఆసియా అభివృద్ది బ్యాంకు నిధులు వస్తున్నందన ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులు త్వరగా వచ్చేందుకు ప్రత్యేకంగా ఎన్విరాన్ మెంటల్ అండ్ సోషల్ మేనేజ్ మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాల పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించింది. 524.70 కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్ పనులు పూర్తి అవుతాయని తెలిపింది. ఈ భవనాల నిర్మాణాన్ని సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ3- N11, ఈ3-N12 జంక్షన్ సమీపంలో 2017లో ప్రారంభించారు. అప్పట్లో ఎన్ సీ సీ సంస్థ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది.15.65 ఎకరాల విస్తీర్ణంలో స్టిల్ట్ ప్లస్ 12 అంతస్తులతో మొత్తం 18 టవర్లలో 432 ఫ్లాట్ల నిర్మాణం 444 కోట్లతో ప్రారంభించారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్విఏసీ, ఎంఈపిఎఫ్, ఐసీటీ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి. డిజైన్, బిల్డ్, ఐటెమ్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్‌పై టెండర్లు పలువనున్నారు. రెండు మూడు రోజుల్లో టెండర్ పిలిచి 20 రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటారు.సీడ్ యాక్సిస్ రోడ్,ఈ3-N11 జంక్షన్ వద్ద సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనాన్ని 2 లక్షల 42వేల 481చదరపు అడుగుల విస్తీర్ణంలో పనులు స్టార్ట్ చేశారు. అదనంగా పార్కింగ్,ల్యాండ్ స్కేపింగ్ 2.51 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇప్పటికి 61.48 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు 160 కోట్లు పెట్టాలి. దీనికి టెండర్లు పిలిస్తే నాలుగు కంపెనీలు పోటీ పడ్డాయి. పోటీలో L1గా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్‌కు పనుల అప్పగించబోతున్నారు. నాలుగైదు రోజుల్లో పనులు స్టార్ట్ అవుతాయిఅమరావతి నిర్మాణంలో 3 కీలక విభాగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకటి అమరాతి ప్రభుత్వ సముదాయం, రెండోది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలు, మూడోది ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్. మొత్తం రెండు దశల్లో అభివృద్ది పనుల పూర్తికి అంచనాలు సిద్ధం చేశారు. మొత్తం 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి తీసుకుంటారు. ట్రంక్ ఇన్ ఫ్రా పనుల కోసం డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ నియమించనున్నారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసి)చూస్తోంది. ఇందులో కేపిటల్ సిటీలో 34 రోడ్లు, మురికినీటి కాలువలు, నీటిసరఫరా నెట్ వర్క్‌లు ఉన్నారు. వీటితోపాటు పవర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వరద నివారణ పనులు, పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు, నీరుకొండ,కృష్ణయ్యపాలెం రిజర్వాయర్‌ల విస్తరణ కూడా దీని కిందికే వస్తుంది. ఐదేళ్లగా అమరావతి పనులు నిలిచిపోవడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు టెక్నికల్ స్టడీ చేస్తారు. దీని టెండర్లను ఆర్వీ అసోసియేట్స్ సంస్థ ఎల్ వన్‌గా నిలిచి టెండర్ దక్కించుకుంది. వివిధ పనుల ప్రస్తుత పరిస్థితి, పెండింగ్ పనుల ఖర్చులను అంచనా వేస్తుందీ సంస్థ. వరద పనులు కోసం టెండర్ డాక్యుమెంట్‌ల రూపకల్పన వంటి అంశాలతో డీపీఆర్ సిద్ధం చేయనుంది. 2015 వరకూ అందుబాటులో ఉన్న వర్షపాతం డేటా ఆధారంగా అమరావతిలో వరద నివారణ పనుల కోసం బ్లూ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశారు. 2015 నుంచి 2024 వరకూ ఉన్న వర్షపాతం డేటాతో అప్ డేట్ చేయాల్సి ఉంది. వైకుంఠపురం వద్ద 5650 క్యూసెక్కుల నీటిని పంప్ చేసేలా పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. రెండో దశ డీపీఆర్ తయారీకి సలహాదారును నియమించేందుకు సీఆర్డీ అథారిటీ ఓకే చెప్పింది.