మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు, ఆయన కుటుంబసభ్యులకు హాని తలపెడతామని హెచ్చరిస్తూ మావోయిస్టు సంస్థలు రెండు లేఖలు పంపాయి. వారం కిత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇవి వచ్చినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల గడ్చిరౌలీలో భద్రతదళాలు చేపట్టిన ఆపరేషన్లలో.. 39 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనల ప్రస్తావన రెండు లేఖల్లోనూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటు ఈ హెచ్చరికపై ఫడణవీస్ స్పందించారు. గతంలో మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యేవారని.. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారని.. ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు వెలుగుచూసిన విషయం గురించీ ఆయన మాట్లాడారు. ‘‘పుణె పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తుల్లో ఒకరి ఇంట్లో లభ్యమైన లేఖలో.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తరహాలోనే మోదీనీ అంతం చేయాలని మావోయిస్టు కమాండర్ సూచనలు చేసినట్లుగా ఉంది. దాడుల్లో ఇలాంటి లేఖలు ఇంకొన్ని బయటపడ్డాయి. విచారణ సంస్థలు, నిఘా సంస్థలు మరింత సమాచారం కోసం అన్వేషిస్తున్నాయి’’ అని ఫడణవీస్ అన్నారు. తదుపరి విచారణ కోసం వీటిని పోలీసులకు అప్పగించామని పేర్కొన్నారు.