YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శారద పీఠానికి షాక్... హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద

శారద పీఠానికి షాక్... హైదరాబాద్ కు మకాం మార్చేసిన స్వరూపనంద

విశాఖపట్టణం, అక్టోబరు 21,
విశాఖ శారదా పీఠానికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసిపి ప్రభుత్వం కేటాయించిన స్థల అనుమతిని రద్దు చేసింది. చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వైసిపి హయాంలో శారదా పీఠం కళకళలాడింది. పీఠాధిపతి స్వామి స్వరూపానంద కు ఎనలేని ప్రాధాన్యత లభించేది. ఆయన సిఫారసులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వరూపానంద చేసిన యాగాలతోనే జగన్ కు అధికారం దక్కిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. దీంతో వైసీపీ నేతల తాకిడి పీఠానికి పెరిగింది. ఏటా జరిగే పీఠం వార్షికోత్సవాలకు, పర్వదినాలకు విశాఖ శారదా పీఠానికి జగన్ వచ్చేవారు. అటు రాష్ట్ర ప్రభుత్వపరంగా ధార్మిక విషయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. స్వరూపానంద స్వామీజీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతలా జగన్ తో స్వామీజీ అనుబంధం పెనవేసుకుపోయింది. అయితే అదే చదువుతో విశాఖలో వైదిక యూనివర్సిటీ కోసం భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారు స్వామి స్వరూపానంద. దీంతో 250 కోట్ల విలువ చేసే భూమిని.. 15 లక్షల రూపాయలకే అందించింది వైసీపీ సర్కార్. వైదిక యూనివర్సిటీ కోసం అని చెప్పిన ఆ భూమిని.. వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకుంటామని శారదాపీఠం దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. శారదాపీఠం కార్యకలాపాల విస్తరణ, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు భూమి కేటాయించాలని పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గత జగన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ఈ మేరకు భీమిలి మండలం కొత్తవలసలో సర్వే నెంబర్ 102/2లో 7.7 ఎకరాలు, 103.2లో 7.3 ఎకరాలు.. మొత్తం 15 ఎకరాల భూములను కేటాయించారు. ఆ సమయంలో ధర నిర్ణయించాలని అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ ను కోరగా.. రిజిస్ట్రేషన్ విలువ పరిగణలోకి తీసుకుని ఎకరాకు 1.8 కోట్ల రూపాయలకు ఇవ్వొచ్చని సిఫార్సు చేశారు. దాని ప్రకారం ప్రభుత్వానికి శారదాపీఠం సుమారు 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, జగన్ సర్కార్ ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చేసింది. అంటే, 15 ఎకరాలను రూ.15 లక్షలకే ఇచ్చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్ లో గల భూములు ఎంతో విలువైవని, కొత్తవలసలో ఎకరం ధర బహిరంగ మార్కెట్ లో 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉంది. ఆ లెక్కన శారదాపీఠానికి ఇచ్చిన భూముల విలువ చూసుకుంటే 250 కోట్ల నుంచి 350 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత విలువైన భూములను శారదాపీఠానికి కారు చౌకగా ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలువురు కోర్టును సైతం ఆశ్రయించారు.అయితేఇప్పుడు అదే భూమి కేటాయింపు అనుమతులను రద్దు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించడం విశేషం.ఏపీలో ఫలితాలు వచ్చిన తర్వాత స్వామి స్వరూపానంద మాట్లాడారు. తనకు చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనా దక్షుడని కూడా కొనియాడారు. గతంలో రాజమండ్రిలో ఆయన కోసం యాగం చేసినట్లు కూడా గుర్తు చేశారు. అయితే ఇదంతా విశాఖలో కేటాయించిన భూమికేనని ప్రచారం సాగింది. గత నాలుగు నెలలుగా ఈ భూమిపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. రకరకాల కామెంట్స్ వినిపించాయి. కూటమి ప్రభుత్వంలో సైతం స్వామీజీ లాబీయింగ్ పనిచేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఏకంగా చంద్రబాబు సర్కార్ స్వామీజీ కి షాక్ ఇచ్చింది. ఆ భూముల అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ విషయాన్ని స్వామీజీ ముందుగానే గ్రహించినట్టు ఉన్నారు. ఏటా నాగుల చవితి నాడు స్వామి వారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది నాగుల చవితి ఇక్కడే జరుపుకుని.. స్వామీజీ హైదరాబాద్ మకాం మారుస్తారని ప్రచారం సాగుతోంది. అక్కడ తెలంగాణలో శారద పీఠానికి కేసీఆర్ సర్కార్ 4 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఈ భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని శారదాపీఠం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే 250 కోట్ల విలువ చేసే భూమి తిరిగి ప్రభుత్వానికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts