YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విచారణకు రండి... అమోయ్ కుమార్ కు నోటీసులు

విచారణకు రండి... అమోయ్ కుమార్ కు నోటీసులు

మెదక్, అక్టోబరు 21,
ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ శనివారం నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో ధరణి పేరుతో అనేక మంది బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వ్యవహరించి, వందల ఎకరాల బదిలీలు చేయటంలో సహకరించారని అప్పట్లో మీడియా కోడై కూసింది. అయితే, ఎట్టకేలకు ఈ అవినీతి అధికారిని ఈడీకి నోటీసులు ఇవ్వటంతో ఇతగాడితో బాటు నాడు భూదందాలు చేసిన కలెక్టర్లు, పలువురు గులాబీనేతలకూ త్వరలోనే ఈడీ పిలుపు రానుందని తెలుస్తోంది.అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లిపూర్ రెవిన్యూ పరిధిలోని 17 సర్వే నంబర్లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 386 ఎకరాల భూమి ఉండగా, అందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞ బోర్డ్ భూమి కాగా, మరో 61 ఎకరాల ప్రభుత్వ భూమి. ఇందులో 53 ఎకరాల సీలింగ్ భూమి,197 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులోని సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు ఉంది. ఈ భూమిని ఆ రైతులు ఆదినుంచి సాగుచేసుకుంటున్నారు. ఇదే 17 సర్వే నంబర్లోని 26 ఎకరాల ప్రైవేట్భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి, సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడు. రైతులు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ధరణిలో చూస్తే సీలింగ్పట్టా అని ఉందని, అక్కడి రైతులు బీఆర్ఎస్లీడర్లను, అప్పటి తహసీల్దార్, ఆర్డీవోతోపాటు కలెక్టర్ అమోయ్ కుమార్ను కలిసి ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా.. అమోయ్ మౌనం వహించాడు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైన నేతలతో రియల్టర్కు మంచి పరిచయాలు ఉండడంతో.. తమ భూములు బెదిరించి గుంజుకున్నాడని రైతులు అప్పట్లో ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చింది.హైదరాబాద్ కేంద్రంగా లావాదేవీలు నిర్వహిస్తున్న పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల లావాదేవీలు పరిశీలించే క్రమంలో పెద్దమొత్తంలో అమోయ్ కుమార్‌ ఖాతాలకు డబ్బు బదిలీ అయిందని గుర్తించిన ఈడీ అధికారులు పక్కా సమాచారంతోనే అతడికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖాజాగూడలోని వంశీరామ్ బిల్డర్ట్స్‌లోని ఎన్‌వోసీ క్లియర్ చేయటం, ఫినిక్స్ లాంటి సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం, 22 జాబితాలోని నిషేధిత భూములను క్లియర్ చేయాలని ఆదేశాలివ్వటం, వట్టినాగులపల్లి, మంచిరేవుల, నార్సింగి,కోకాపేట, మాదాపూర్, కొండాపూర్, గుట్టలబేగం పేట వంటి ఖరీదైన ప్రాంతాలలో కోట్లలో డబ్బుతీసుకుని ధరణి పేరుతో ఎన్‌వోసీలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నాటి బీఆర్ఎస్ పెద్దలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అమోయ్ 500 నుంచి 600 కోట్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి.బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు 59 జీవో కింద ఉన్న అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా తమ పేరిట, అనుచరుల పేరిట బదిలీ చేయించుకోవటంలో అమోయ్ వారికి అడగడుగునా సహకరించాడు. నార్సింగి చెరువు భూములను నిబంధనలకు వ్యతిరేకంగా డీమార్కేషన్ చేసి, ఫినిక్స్ సంస్థకు బదిలీచేసి, ఆ భూములను బీఆర్ఎస్ నేతలకు కేటాయించి, వారికి ఎన్‌వోసీలు జారీ చేసిన అంశంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెరువులు, జలాశయాలను అడ్డగోలుగా నాటి ప్రభుత్వ పెద్దలకు కట్టబెట్టిన వ్యవహారంలో ఇతని పాత్ర ఉందని తెలుస్తోంది.రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో శంషాబాద్‌లో 21 ఎకరాల సర్కారు భూమిని ధరణిలో లొసుగుల ఆధారంగా ప్రైవేటు పరం చేశారని ఆరోపణలున్నాయి. మాడ్గుల మండలం, నాగిళ్ళ గ్రామ రెవిన్యూ పరిధిలోని, ఫిరోజ్‌ నగర్‌ గ్రామానికి చెందిన సుమారు 7 ఎకరాల భూమి ఆన్లైన్‌ లో అక్రమంగా నమోదైన ఘటనలోనూ అమోయ్ అభయహస్తముందని అప్పట్లో పత్రికలలో కథనాలొచ్చాయి.స్థాయి మరచి అవినీతికి పాల్పడిన ఇలాంటి అధికారి అవినీతి లీలలను ఈడీ బయటపెట్టాలని అప్పట్లో అమోయ్ కుమార్ బాధితులంతా ఇప్పుడు బయటికి వస్తున్నారు

Related Posts