ఒంగోలు, అక్టోబరు 24,
కూటమి కొలువుదీరి నాలుగు నెలలు దాటుతోంది. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేసి పాలనపై దృష్టి పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తొలి జాబితా పైరేగిన అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నామినేటెడ్ పదవుల పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు అధ్యక్షులు నియామకంతో పాటు 99 మంది డైరెక్టర్లను నియమించింది. ఇప్పుడు రెండో విడతగా మరి కొంతమంది నియామకానికి కసరత్తు చేస్తోంది. అయితే వేలాదిమంది ఆశావహులు ఉండడంతో.. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కత్తి మీద సాముగా మారింది. పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది తమ సీట్లను త్యాగం చేశారు. మరి కొంతమంది సీనియర్లు పార్టీ కోసం పనిచేశారు. ఇంకొందరు ఆర్థికంగా ఆదుకున్నారు. వీరందరికీ నామినేటెడ్ పోస్టులు సర్దుబాటు చేయాల్సి ఉంది. కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఆ పార్టీలోనే ఆశవహులు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకున్నామని.. తమ కృషితోనే కూటమి సక్సెస్ అయిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బిజెపి సైతం తమది జాతీయ పార్టీ అని.. తమ గౌరవానికి తగ్గట్టు పదవులు ఇవ్వాల్సిందేనని వారు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుపై ఒత్తిడి తప్పడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు ఒక ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. సింహభాగం పదవులు టిడిపికి విడిచి పెట్టాలని.. అదే సమయంలో జనసేన, బిజెపికి సైతం ప్రాధాన్యం ఉంటుందని ఒప్పించడంలో చంద్రబాబు విజయవంతం అయినట్లు తెలుస్తోంది.వాస్తవానికి నామినేటెడ్ పదవుల భర్తీలో మొదట ఒక ఫార్ములా తెరపైకి వచ్చింది. 60 శాతం పదవులు తెలుగుదేశం పార్టీకి, 30% పదవులు జనసేనకు, 10 శాతం పదవులు బిజెపికి కేటాయిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట పార్టీకి 60 శాతం, జనసేనకు 30, బిజెపికి పది శాతం ఇస్తారని.. జనసేన ఎమ్మెల్యే ఉన్నచోట పార్టీకి 60, టిడిపికి 30, బిజెపికి పది శాతం ఇస్తారని టాక్ నడిచింది. బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నచోట మాత్రం ఆ పార్టీకి 50 శాతం.. మిగతా 50 శాతం టిడిపి, జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. అయితే అవేవీ లేకుండానే గత నెలలో నామినేటెడ్ పదవులు ప్రకటించారు. టిడిపికి 16, జనసేనకు మూడు, బిజెపికి ఒక కార్పొరేషన్ పదవి దక్కింది.అయితే నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా పై తీవ్ర అసంతృప్తులు వ్యక్తం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కువమంది బాధపడ్డారు. జనసేన సైతం తమ బలానికి తగ్గట్టు పదవులు రాలేదని అసంతృప్తి వ్యక్తం అయ్యింది. అయితే ఈసారి అలాకాకుండా చంద్రబాబు ఒక ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన టిడిపి శ్రేణులకు సర్దుబాటు చేసే క్రమంలో.. 80 శాతం పదవులు టిడిపికి ఉండేలా మిగతా రెండు పార్టీలను ఒప్పించారన్నది ఈ ఫార్ములా సారాంశం. అయితే జనసేన అందుకు ఒప్పుకోలేదని.. కానీ చంద్రబాబు ఒప్పించేసరికి పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ 20% లోనే బిజెపికి కొన్ని పదవులు కేటాయించాల్సి రావడంతో జనసేనలో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు టిడిపికి ప్రాధాన్యం దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యారన్నమాట.