విజయవాడ, నవంబర్ 1,
వైఎస్ కుటుంబకథా ఆస్తుల చిత్రంలో రోజుకో విచిత్రం వెలుగుచూస్తోంది. ఇదో డైలీ సీరియల్ లా మారింది. ఎవరి వెర్షన్ వారిదే అన్నట్లుగా సీన్ టూ సీన్ నడుస్తోంది. ఎవరి యాంగిల్ లో చూస్తే వారిదే కరెక్ట్ అనిపించేలా హైడ్రామా రక్తి కడుతోంది. ఇది కచ్చితంగా కుటుంబ వ్యవహారమే అని అనుకోవడానికి వీలు లేకుండా బహిరంగ లేఖలు రిలీజ్ చేసుకోవడం పొలిటికల్ గా ఆసక్తికరంగా మారింది. చివరకు జగన్, షర్మిల తల్లి విజయమ్మ కూడా లేఖ ద్వారా తన వెర్షన్ వెల్లడించారు. తన కూతురి వైపే మొగ్గు చూపారు. జగన్-షర్మిల ఆస్తి పంపకాల మ్యాటర్ కథ క్లైమాక్స్ కు చేరుతుందా.. అంటే ముమ్మాటికీ కాదన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇందులో ట్విస్టులు మామూలుగా లేవు. ఒకరిని మించి మరొకరు కౌంటర్లు విసురుకుంటున్నారు. ఆస్తిలో ఇవ్వాల్సినవి ఎప్పుడో ఇచ్చేశానని జగన్ అంటుంటే.. వైఎస్సార్ చెప్పినట్లు ఎక్కడ ఇచ్చారన్నది షర్మిల లా పాయింట్. అంతే అక్కడి నుంచి కథ ముందుకు అస్సలు సాగడం లేదు. మధ్యలో లేఖలతో డైలాగ్ వార్ లు కూడా నడుస్తున్నాయి. సొంతంగా సంపాదించుకున్నది ఎందుకివ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అన్న లా పాయింట్ల చుట్టూ పంపకాల వ్యవహారం హాట్ డిబేట్ గా మారిపోయింది. ఇక లాభం లేదు విజయమ్మ రంగంలోకి దిగాల్సిందే.. ఇద్దరు బిడ్డల మధ్య ఆస్తి తగాదా తెంపాల్సిందే అని వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారంతగా ఒక్కొక్కరుగా బయటికొచ్చి ఇప్పటికే మాట్లాడారు. దీంతో ఫైనల్ గా విజయమ్మ తెరపైకి వచ్చారు. ఇద్దరు బిడ్డల ఆస్తి తగాదాకు పుల్ స్టాప్ పెడుదామని లేఖ ద్వారా ప్రయత్నమైతే చేశారు గానీ అది మరింత అగ్గి రాజుకునేలా మారిపోయింది. ఇంతకీ విజయమ్మ ఏమన్నారంటే.. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోందని, జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయన్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదరించే వారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని, అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదని, ఈ ఘటనలు తన పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదంటూ లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేసుకొచ్చారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నది.. వాళ్లు ప్రేమించే వైఎస్‌ఆర్ గురించేనని మరిచారని, తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అనే స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారన్నారు. వైఎస్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారని, అది అవాస్తవమని చెప్పారు విజయమ్మ. విజయసాయి రెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసని కూడా చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారని, అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఫైనల్ గా విజయమ్మ తేల్చిన విషయం ఏంటంటే.. రాజశేఖర్ రెడ్డి మాట ప్రకారం.. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమని, ఇదే నిజమన్నారు. అంతే కాదు.. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందని, కానీ అన్ని ఆస్తులూ కుటుంబ ఆస్తులే అన్నది కూడా నిజమన్నారు. ఫైనల్ గా షర్మిల పాలిటిక్స్‌లో జగన్ చెప్పినట్లు చేసిందని, జగన్ కోసం నిస్వార్ధంగా కష్టపడిందని, అధికారంలో రావడానికి ఆమె కృషి ఎంతో ఉందని చెప్పడం ద్వారా పాపకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనని క్లారిటీ ఇచ్చుకున్నారు.కాబట్టి విజయమ్మ తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. ఆస్తి పంపకాల విషయంలో షర్మిలవైపే నిలిచారు. ఇప్పటికే జగన్ కు విజయమ్మ దూరంగా ఉంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య రావొద్దనుకుని అమెరికాకే పరిమితం అయ్యారు. కాబట్టి ఇప్పుడు విజయమ్మ మధ్యవర్తిగా తాను చెప్పాల్సినవి చెప్పారు. అయితే ఇద్దరూ తల్లి మాట వినేటట్లు ఉంటే ఈ గొడవ రచ్చకెందుకు ఎక్కుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. విజయమ్మ మాట వినేదే లేదని జగన్ వర్గం అంటున్న మాట. అందుకే విజయమ్మ లేఖపై వైసీపీ ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ లెటర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్పారంటే.. వైఎస్సార్ సతీమణిగా, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తల్లిగా విజయమ్మగారిని తాము గౌరవిస్తామని, అయితే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ద్వారా ఆమె షర్మిల ఒత్తిడికి లొంగిపోయారని అర్థమవుతోందని రాసుకొచ్చారు.అంతే కాదు.. విజయమ్మ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దు కుట్రను ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఇది వివాదాన్ని మరింత పెంచేందుకు చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోందని వైసీపీ అంటోంది. ఇది ముమ్మాటికీ చంద్రబాబుకు మేలు చేయడమే అని, విజయమ్మగారికి ధర్మమేనా.. అంటూ ప్రశ్నిస్తోంది జగన్ వర్గం. ఇద్దరు బిడ్డల మధ్య తటస్థంగా ఉండాల్సింది పోయి ఆమె ఇలా పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరమని, విజయమ్మ వ్యవహారంతో వైఎస్సార్ అభిమానులు కలత చెందుతున్నారంటూ రాసుకొచ్చారు. సో అదీ మ్యాటర్. అంటే ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుందని, లెక్కలు తేలే వరకు ముగిసేది కాదన్న విషయమే ఏపీలో అందరికీ అర్థమవుతున్న విషయం.వైసీపీ అలా కౌంటర్ లెటర్ రిలీజ్ చేసిందో లేదో.. ఇలా షర్మిల కూడా మరోసారి రంగంలోకి దిగారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని, గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, ట్రాన్స్ ఫర్లను మాత్రం ఆపలేదంటున్నారు. 2019లో షర్మిలకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని మరోసారి ప్రశ్నించారు.అంతే కాదు మరో ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన, సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని ప్రశ్నిస్తున్నారు. షేర్స్ ట్రాన్స్ ఫర్ కి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని తెలుసు కాబట్టే అలా చేశారని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏ లెక్కన చూసినా ఈ ఆస్తి వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైఎస్సార్ చెప్పారు కాబట్టి వాటాలు వదులుకోబోనని షర్మిల అంటున్నారు. ఇవ్వాల్సినవి ఇచ్చేశాను, ఇక ఇచ్చేదేమీ లేదని జగన్ అంటున్నారు. మ్యాటర్ ఇక కోర్టులే తేల్చాలి.