ముంబై, నవంబర్ 1,
నామినేషన్ల పర్వం దాదాపు కొలిక్కి రావడంతో మహారాష్ట్ర ఎన్నికల పోరు మేజికల్ టర్న్ తీసుకోబోతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండు ప్రధాన కూటములకూ డూఆర్‌డై సిట్యువేషన్ ఇది. ఈసారి కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం.. అనే చర్చ ఒకటైతే, తెలంగాణలో సూపర్‌హిట్ కొట్టిన రాహుల్‌గాంధీ గ్యారంటీ కార్డ్ మహారాష్ట్రలో వర్కవుటౌతుందా అనేది మరో సస్పెన్స్..! గ్యారంటీ కార్డుపై శత్రు కూటమి ఇప్పటికే సీరియస్‌గా సెటైర్లందుకుంది..కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సెంటిమెంట్‌ను మహారాష్ట్రలో కూడా ప్రయోగించబోతోందన్న వార్తలు అక్కడి పాలిటిక్స్‌లో వేడి పుట్టించేశాయి. బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో అడ్డం తిరిగిన గ్యారంటీ కార్డు, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో వ్యతిరేకత కూడగట్టిన గ్యారంటీ కార్డు.. మహారాష్ట్రలో ఎలా పని చేస్తుందని, కాంగ్రెస్ ఎక్స్‌పరిమెంట్‌పై సెటైరేశారు ఫడ్నవీస్.అటు.. ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మహా యుతి కూటమి గెలుపు ఖాయమని, బీజేపీ నేతకే సీఎం సీటు దక్కుతుందని MNS అధినేత రాజ్‌థాకరే చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. మహా యుతి కూటమికి మేజిక్ ఫిగర్ రాదని, బయట నుంచి తాము మద్దతిస్తామని కూడా చెప్పారు రాజ్‌థాకరే. ప్రస్తుతానికి రెండు కూటములకూ దూరంగా ఉంది రాజ్‌థాకరే పార్టీ. ఆయన వ్యాఖ్యలు మాత్రం రెండు కూటముల్లోనూ అంతర్గతంగా కలకలం రేపాయి. ముఖ్యంగా శివసేన-షిండే వర్గం తాజా పరిణామాల్ని సీరియస్‌గా గమనిస్తోంది.మహారాష్ట్రలో నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ నవంబర్ 4. ఆలోగా రెబల్ అభ్యర్థుల్ని దారికి తెచ్చుకుని, నామినేషన్లను వెనక్కు తీసుకునేలా మంతనాలు షురూ చేశాయి పార్టీలన్నీ. అటు.. ఎమ్‌వీఏ కూటమి 11 స్థానాల్లో.. మహా యుతి కూటమి 4 చోట్ల ఇప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించనే లేదు.మహా యుతి కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి స్టార్ క్యాంపెయినర్లు ప్రచార షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. మహా వికాస్ అఘాడీ తరఫున ప్రచారం కోసం రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటన చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను నవంబర్ 6న ముంబైలో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోపాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే హాజరుకానున్నారు.288 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కమిషన్‌కు 7,995 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మరో వారం రోజుల్లో మహాగల్లీల్లో లౌడ్‌స్పీకర్లు మోతెక్కిపోవడం మాత్రం గ్యారంటీ..!