హైదరాబాద్, నవంబర్ 1,
బ్లాక్ బుక్, రెడ్ డైరీ, రెడ్ బుక్ ఈ పదాలు ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీ పేర్లు రాసుకుంటున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు తెలుస్తామంటూ బ్లాక్ బుక్, రెడ్ డైరీలను చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరి పేర్లు రాస్తున్నారు.. రాసుకiని ఏం చేయబోతున్నారు? అన్నదీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ప్రతిసారీ మాట్లాడుతూ రెడ్ డైరీ ప్రస్తావించారు. అధికారుల పేర్లు రాసుకుంటున్నాను అధికారంలోకి వచ్చాక సంగతి చెప్తాను అంటూ ప్రతిసారి స్టేట్‌మెంట్ ఇచ్చాడు నారా లోకేష్. ఇప్పుడు తెలంగాణలో తాజాగా అలాంటి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ అంటూ తెలంగాణలో ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టాడు. ప్రతి ప్రెస్ మీట్‌లోనూ బ్లాక్ బుక్ చూపించి అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు.మొదటగా హుజూరాబాద్ ఆర్టీఏ అధికారులు, హుజూరాబాద్ ఎంఈవో, ఇలా కొంతమంది పోలీసు అధికారుల పేర్లు రాసుకున్నాను అంటూ ప్రకటించారు. తన ఇంటిపై దాడి జరిగినప్పుడు ఏ పోలీస్ అధికారులు ప్రత్యర్థులకు సహకరించారో వారి పేర్లను నోట్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా తనపై డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర జరిగిందని, అందుకు సహకరించిన పోలీసు అధికారుల పేర్లను మరోసారి బ్లాక్ బుక్ లో రాసుకున్నాను అంటూ చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ బుక్ లో ఉన్న పేర్లు ఉన్నవారికి అన్ని బ్లాక్ డేస్ అంటూ చెప్పారు.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా వనపర్తి రైతు ధర్నాలో మాట్లాడుతూ.. అత్యుత్సాహం చూపిస్తున్న పోలీస్ అధికారుల పేర్లను తాను రెడ్ డైరీలో రాసుకుంటున్నాను అంటూ బహిరంగ వేదికపైనే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదిలిపెట్టం అన్నారు హరీష్ రావు. ఇదే బీఆర్ఎస్ పార్టీలోని ఇంకొంతమంది నేతలు రెడ్ బుక్ లో ఓవరాక్షన్ చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రాసుకుంటున్నామంటూ చెబుతున్నారు. ఇంతకీ ఈ ప్రకటనలు దేనికి సంకేతం..అయితే అధికారులను బెదిరించడానికా అంటే కాదని ఇంటర్నల్‌గా చెప్తున్నారు ప్రతిపక్ష నేతలు. కింద స్థాయి కేడర్ కి, కార్యకర్తలకి ధైర్యం నింపడం కోసమే ఇలాంటి టెక్నిక్స్ వాడుతామని అంటున్నారు. దాంతోపాటు అధికారులను కొంత భయం ఉంటుంది.. ప్రభుత్వాలు మారితే ఇబ్బందులు ఎదుర్కొంటామని సంకేతాలు ఉంటాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ లో పేర్లు బయటకు రాకపోయినా కొంతమంది అధికారులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్ నేతలు కేసుల్లో ఇరుక్కుని పడుతున్న కష్టాలను చూసైనా తెలంగాణలో ఉన్న అధికారులు మారాలని కోరుతున్నారు.