హైదరాబాద్, నవంబర్ 1,
హైడ్రా గుబులు పుట్టిస్తోంది. ఆస్తులు కాపాడుకోవాలని తపన వెంటాడుతోంది. అందుకే మీ చెంత చేరిపోతానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు మల్లారెడ్డి. కానీ హస్తం పార్టీ నో చెప్పేసింది. నాలుగు రోజలు వెయిట్ చేశారు. మనవరాలి పెండ్లి ఆహ్వాన పత్రికతో అందరినీ బుట్టలో పడేశారు. కారు దిగేందుకు రెడీ అయ్యారు. గతంలోనే హస్తంకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు మల్లన్న ప్రయత్నించినా కుదరలేదు. ప్రస్తుత పరిస్థితులు మల్లన్నను కాంగ్రెస్‌కు దగ్గర చేసేలా కనిపిస్తున్నాయట.
మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం చూస్తుంటే అంతా సెట్ అయిందని..జాయినింగే ఆలస్యమన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లిలో సీఎం రేవంత్ చేసిన హడావుడి, కుటుంబ సభ్యుల నుంచి మొదలు చిన్న పిల్లల వరకు రేవంత్ కాళ్లు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించడం చూస్తోంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదో తేడా కొడుతుందన్న టాక్ వినిపిస్తోంది.లేటెస్ట్ డెవలప్‌మెంట్ చూస్తుంటే మల్లారెడ్డి BRSను వీడబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఆయన అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మామతో పాటు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు టాక్. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన కొత్తలోనే మల్లారెడ్డి అల్లుడితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించినా సీఎం రేవంత్ రెడ్డి అంత సముఖత చూపలేదని తెలుస్తోందిచేసేదేం లేక ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారట మామా అల్లుళ్లు. ఇంతలో హైడ్రా ప్రభావంతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతిపాదనను సీఎం రేవంత్ ముందుంచారట మల్లారెడ్డి. ఇందుకు తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించే సందర్భాన్ని వాడకున్నారట.మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు పెళ్లి కార్డు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాన్ని లేవనెత్తారట మామా అల్లుళ్లు. అందుకు సీఎం కూడా ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం శంషాబాద్‌లో జరిగిన మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం రేవంత్ హాజరయ్యారని చెబుతున్నారు.
అంతేకాదు పెళ్లి వేడుకలో రేవంత్ రెడ్డి బాగా సందడి చేశారు. మల్లారెడ్డి దగ్గరుండి తమ కుటుంబ సభ్యులను రేవంత్‌కు పరిచయం చేశారు. అంతే కాదు టీనేజర్స్ నుంచి మొదలు చిన్న పిల్లల వరకు అందరితో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించారు మల్లారెడ్డి. పేరు పేరునా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సీఎం ఫోటోలకు పోజులిచ్చారు.ఇదంతా చూస్తోంటే పెళ్లి ఆహ్వాన రాయభారం వర్క్ అవుట్ అయినట్టేనన్న చర్చ మొదలైంది. అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి రావడంతో అంతా సెట్ అయిందని చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.త్వరలోనే GHMC ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలం పెంచుకోవడం కోసం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. పది రోజుల కింద గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశానికి స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసినా మామా అల్లుళ్లు పెళ్లి పనుల పేరుతో డుమ్మా కొట్టారని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.