హైదరాబాద్, నవంబర్ 4,
తెలంగాణలో. బీసీ కులగణన వెనక వ్యూహం అదేనా.. ఈ కార్యక్రమం కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకురాబోతోందా.. బీసీ నేతలకు సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి.. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలిస్తుందా లేదా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో హస్తం పార్టీ బీసీ జపం చేస్తుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… ఇప్పటినుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకొని పనిచేస్తోంది. తెలంగాణలో 50శాతానికి పైగా బీసీ జనాభా ఉంది. మెజారిటీ వర్గమైన బీసీలను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకోవాలని… హస్తం పార్టీ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. బీసీ కులగణన పేరుతో… భారీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.. కాంగ్రెస్‌కు బీసీల్లో బలం తక్కువ అనే చర్చ మొదటి నుంచి ఉంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ వైపు కాస్త మొగ్గుచూపిన బీసీలు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్‌కే ఎక్కువ మద్దతుగా ఉన్నారు. గత పదేళ్లలో రకరకాల సంక్షేమ పథకాలతో.. బీసీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పదిలంగా ఉంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు.. బీసీ జనగణనను యూజ్ చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది.బీసీ జనగణనతో.. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లబ్ధి చేకూరనుంది. గత ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పదేపదే.. ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు… ఆ స్థాయిలో లబ్ధి చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. జనాభా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచుతామని.. నిధులు కూడా జనాభా ప్రకారం ఆ వర్గాలకు ఖర్చు పెడతామని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీసీ కులగణన చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నవంబర్ 6నుంచి కులగణన ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో ఏ సర్కార్ చేయని సాయాన్ని.. తమ ప్రభుత్వం చేస్తుందనే అంశాన్ని బీసీల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.జనగణన ద్వారా బీసీలకు జరిగే లబ్ధిని.. ప్రతీ గ్రామంలో తెలియజేయాలని.. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. గ్రామ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. నేతలను పార్టీ పెద్దలు ఆదేశించారు. బీసీల్లో మెజారిటీ జనాలను పార్టీ వైపు తిప్పుకుంటే.. వచ్చే ఎన్నికల్లో అధికారానికి ఢోకా ఉండదని.. హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారని టాక్. దీనికోసం బీసీల్లో ఆయా కులా సంఘాల పెద్ద మనుషులను రంగంలోకి దింపబోతున్నారని సమాచారం. ఆయా కులాల మీటింగ్‌లు పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ జనగణన, దాని ద్వారా బీసీలకు జరిగే మేలును వివరిస్తారని తెలుస్తోంది. దీని కోసం కాంగ్రెస్‌లో ఉన్న బీసీ ముఖ్యనేతలంతా… ఈ మధ్యే కీలక సమావేశం కూడా నిర్వహించుకున్నారట. బీసీ కులగణనపై ప్రభుత్వం కూడా త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చూస్తోంది.మొత్తం బీసీల్లో 60శాతం ఓటు బ్యాంకును.. పార్టీ వైపు మళ్లించగలిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కొలువు దీరడం ఖాయం అని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. తెలంగాణలో బీసీల‌్లో కీలకమైన యాదవ, గౌడ, ముదిరాజ్, పద్మశాలిలాంటి కులాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేలా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.. వివిధ హోదాల్లో బీసీల్లో ఎంతమందికి అవకాశం ఇచ్చామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించబోతుందని తెలుస్తోంది. బీసీ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని.. నవంబర్ 31 లోగా కులగణన పూర్తి చేసి.. భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని చూస్తోంది. కులగణన ఒక ఎక్స్ రే అని.. మెగా హెల్త్ చెకప్‌కు శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్తోంది కూడా ఇందుకేనట.బీసీ కులగణన పూర్తి చేసి.. తెలంగాణ నుంచి సరికొత్త పొలిటికల్ వార్‌కు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. బీసీ జపం.. కులగణన.. కాంగ్రెస్‌కు మరోసారి అధికారానికి దారి చూపిస్తుందా.. హస్తం పార్టీ నేతల అంచనాలు నిజం అవుతాయో లేదో చూడాలి మరి.