శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు.. అంటూ ఓ సినీకవి.. భారతీయ శిల్పసౌందర్యాన్ని.. వాటిని ఆవిష్కరించిన శిల్పకారులను కీర్తించారు. ఇంతటి అద్భుత సౌందర్యాన్ని పొదువుకున్న శిల్ప సంపదలో అమరావతి అగ్రస్థానంలో ఉంటుంది. అమరావతి.. శిల్పాల్లో ఒదిగిపోయిన రమణీయత చూపరులను కట్టిపడేస్తుంది. వందల ఏళ్ల క్రితం తెలుగునాట ఇంతటి అద్భుత కళ ఉండడం తెలుగువారికి గర్వకారణం. ఘనమైన చారిత్రాత్మక నగరం ఇక్కడ ఉండడం ఓ రకంగా తెలుగువారు చేసుకున్న పుణ్యం. భారతదేశాన్ని 2 వందల ఏళ్లు పాలించింది బ్రిటన్. అమరావతి వైభవం మసకబారి కాలగర్భంలో కలిసిపోతున్న రోజుల్లో నాటి ఘనతను కాపాడింది తెల్లదొరలే. 1700సంవత్సరంలోనే అమరావతిని విశిష్టతను గుర్తించి ఈ చారిత్రాత్మక ప్రదేశాన్ని, ఇక్కడి ఆనవాళ్లను పరిరక్షించాలనుకుంది. ఈ క్రమంలో అమరావతి చరిత్రను తెలుసుకుంది. సజీవ సాక్ష్యాలుగా నిలిచిన శిల్పకళా సంపదకు ముగ్ధురాలైంది. సంభ్రమాశ్చర్యాలకు గురైన బ్రిటన్ ఈ ఆనవాళ్లలో అనేకం తన దేశానికి తీసుకెళ్లింది. తీసుకెళ్లడమే కాదు.. తమ మ్యూజియంలో విశిష్ట స్థానాన్ని కేటాయించింది.
ఇప్పుడైతే ఆధునికత పరచుకుని.. ఆనాటి ఆనవాళ్లు కొంత కరిగిపోయాయి. అయితే.. నాటి వైభవానికి చిహ్నంగా అనేక గుర్తులు ఉన్నాయి. ప్రజలను మైమరిపిస్తున్నాయి. ఇక బ్రిటన్ లోనూ అమరావతి చిహ్నాలు ఠీవిగా కొలువై ఉన్నాయి. అక్కడివారైతే ఈ ఆనవాళ్లను అపురూపంగా చూసుకుంటున్నారు. ఎంతగా అంటే.. లండన్ లోని ప్రఖ్యాత బ్రిటీష్ మ్యూజియంలో అమరావతికి చెందిన శిల్పాలు, ఫలకాలను భద్రపరిచారు. 120కి పైగా ఉన్న వీటికి కోసం ప్రత్యేక గ్యాలరీనే కేటాయించారు. బ్రిటీష్ మ్యూజియంలోని 33ఏ అనే గదిలో అమరావతి శిల్పకళా వైభవం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. అమరావతి చరిత్రను బ్రిటీష్ మ్యూజియం అపురూపంగా చూసుకుంటోంది. అమరావతి ఘనతకు అద్దం పట్టే ఎన్నో చారిత్రక సాంస్కృతిక ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బ్రిటీష్ మ్యూజియంలో బుద్దుని మహాఛైత్యానికి సంభంధించిన అవశేషాలు, శిల్పాలు భద్రపరిచారు. అమరావతి ప్రాశస్త్యాన్ని గుర్తించి 1797లోనే బ్రిటిష్ ఆర్కియాలజీ ఉన్నతాధికారి కల్నల్ మెకన్‌జీ పరిశోధనలు చేశారు. అనేక తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో అరుదైన కళా సంపదకు ముగ్ధులై బ్రిటన్ కు తీసుకెళ్లారు. 1818లో బ్రిటిష్ పరిపాలన వచ్చిన తరువాత ఎన్నో అమరావతి చారిత్రక సంపదను లండన్, పారిస్, బోస్టన్ మ్యూజియంకు తరలించారు. తరువాత కొన్నింటిని కలకత్తా, ఢిల్లీ మ్యూజియంకు, మద్రాస్ మ్యూజియంకు కొన్ని తరలించారు. మిగిలిన వాటిని అమరావతి మ్యూజియంలో భద్రపరిచారు.