YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్వామివారిని రాజకీయం చేయొద్దు

స్వామివారిని రాజకీయం చేయొద్దు
టీటీడీల్లో వివాదాలు కొత్తకాదు. అయితే రమణ దీక్షితుల పుణ్యమాని రాజుకున్న వివాదం మాత్రం భక్త కోటిని ఆవేదనలోకి నెట్టింది. స్వామీజీలు సైతం తీవ్ర వ్యాకులత వ్యక్తంచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవలిగా కొనసాగుతున్న వివాదాలు రాజకీయ రంగును పులుముకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఈ విధంగా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడంపై స్వామిజీలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీవారి సన్నిధిని.. ఈ వివాదం నుంచి బయటపడేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తిరుమలలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ధార్మిక సమ్మేళనాన్ని ఏర్పాటుచేశారు. తిరుమల, తిరుపతి పవిత్రతను కాపాడటం, హిందూ ధార్మిక పరిషత్‌ ఏర్పాటుపై స్వామీజీలు చర్చించారు. కమలానంద భారతీ, పరిపూర్ణానంద స్వామి, విద్యారణ్య భారతి, స్వరూపానంద, నిర్మలానంద భారతీ, ప్రణవానంద స్వామి, గణేషానంద భారతీ, శివస్వామిజీలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. టీటీడీ వివాదాలపై స్వామీజీలు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అందరినీ కలవర పరిచాయని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వేయించి స్వామివారి నగల వివరాలన్నింటినీ మరోసారి గణిస్తే.. అపోహలు తొలగిపోయే అవకాశం ఉందని హంపి పీఠాధిపతి పేర్కొన్నారు. తిరుమలలోనే కాక హిందూ దేవాలయాలన్నింటా ఉన్న ఇతర మతస్థులైన ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేయాలి. దేవాలయాలపై వచ్చిన ఆదాయం ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టంచేశారు.
 
వివాదం పరిష్కారానికి ఇది తొలి ప్రయత్నం మాత్రమే. భవిష్యత్ లో మరిన్ని సార్లు భేటీ అయి సమస్యల పరిష్కారనికి కృషి చేస్తామని హంపి పీఠాధిపతి వివరించారు. తిరుమల విషయంలో సాగుతున్న వివాదాలు భక్తుల్లో తీవ్ర ఆవేదన నింపాయని కమలానంద భారతి అన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికి భక్తులకు స్వాంతన కల్పించేందుకు సమావేశమయ్యామని వివరించారు. తిరుమల విషయంలో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోమని స్పష్టంచేశారు. తిరుమల కీర్తి ఇనుమడింపజేసేలానే వ్యవహరిస్తామని,  తిరుమలలోనే కాక హిందూ దేవాలయాలన్నింటా ఉన్న ఇతర మతస్థులైన ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేయాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వంతో తమకు సంబంధంలేదని కమలానంద భారతి తేల్చి చెప్పారు.ఎవ్వరూ తమను ప్రభావితం చేయలేదని అన్నారు. సమాజానికి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంచేశారు. టీటీడీపై ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం స్వామివారికి సంబంధించిన అంశమని దీనిపై ఏ రాజకీయ పార్టీగానీ, ఎవ్వరూ గానీ ఇక ఏమీ మాట్లాడవద్దని కమలానంద భారతి విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని ఉద్రేకపరచే విధంగా వ్యవహరించాలన్న ఆకాంక్ష తమకు లేదని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు అవసరమైతే రాజధాని అమరావతిలోనూ సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమలానంద భారతి తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టీటీడీ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే వాతావరణం కల్పించాలన్న భావన స్వామీజీల్లో వ్యక్తమైంది. 

Related Posts