హైదరాబాద్, నవంబర్ 11,
బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విమర్శిస్తుంది. అధికారంలోకి రాగానే వాటన్నిటిపై విచారణలకు ఆదేశించింది. ఇటీవల మంత్రి పొంగులేటి విచారణ నివేదికలు రెడీ అయ్యాయని స్పష్టం చేసి, టపాసులు పేలబోతున్నాయంటూ కలకలం రేపారు. ఇప్పుడా విచారణలన్నీ చివరి దశకు చేరాయంటున్నారు. దాంతో కేసుల ఉచ్చులో చిక్కుకునేదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. తమ నేతల్లో ఎవరు ఇరుక్కుంటారో అన్న టెన్షన్ గులాబీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తుంది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో.. వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న విచారణలు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే బాధ్యులపై చర్యలుంటాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి , విద్యుత్తు కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేస్.. ఇలా రకరకాల కుంభకోణాలపై విచారణలు జరుగుతున్నాయి. అవన్నీ చివరి దశకు వచ్చాయన్న ప్రచారంతో తెలంగాణలో అసలేం జరిగింది.. ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలేంటి.. అందులో ఎవరెవరికి భాగం ఉంది.. ఏ శాఖలో ఎంతమేర అక్రమాలు జరిగాయి .. అన్న అంశాల అందరి చర్చల్లో నలుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవివీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. పవర్‌లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్.. తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
పీసీ ఘోష్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయంట. తమకేం తెలియదని.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించామని ఇంజనీర్లు, అధికారులు స్పష్టం చేశారంట, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలకు సంబంధించి ఎవరెవరు ఇరుక్కుంటారనేది ఉత్కంఠ రేపుతుంది. అటు విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. దీనిపైన కూడా విచారణ జరిపించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో విచారణలో భారీ అక్రమాలు బయటపడ్డాయని ప్రభుత్వ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్.. రాష్ట్రంలో భూములను పెద్దఎత్తున అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయ్. అసైన్డ్, దేవాలయ భూములు, భూదాన్ భూములతో పాటు.. ప్రభుత్వ భూములను వేల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అన్యాక్రాంతం చేశారని.. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ అంటుంది. దాంతో ధరణి అక్రమాల్లో ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారో? అన్న టెన్షన్ గులాబీ శ్రేణుల్లో కనిపిస్తుంది.బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీలోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. ఇప్పటికే విచారణలో తేలింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా.. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు.. సినీ, వ్యాపార, రియల్ ఎస్టేట్ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశంపై విచారణ ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందంట. ఫోన్ ట్యాపింగ్‌తో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. దీనికి సంబందించిన విచారణ కూడా తుదిదశకు చేరుకుందంటున్నారు.ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఆఅక్రమాలపై అవినీతి నిరోధక శాఖవిచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ ఫార్ములా రేసు నిర్వహించేందుకు నిబంధనలు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అప్పగించినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. కనీసం జీవో కూడా లేకుండా, నోటి మాట ద్వారా రూ.55 కోట్లు విడుదల చేయడం విమర్శలకు దారి తీసింది. దీనిపై విచారణ జరపాలని అధికారులు ఏసీబీకి లెటర్ రాశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. తాజాగా దానిపై స్పందించిన కేటీఆర్ ఈ-రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, FEOకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమన్నారు.కాదు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలు సభలు సమావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ పదేపదే తన అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. తాజాగా కూడా అరెస్ట్ గురించి మాట్లాడిన ఆయన తనను అరెస్ట్ చేస్తే జైల్లో యోగా చేసి, ఫిట్ నెస్ పెంచుకుని .. పాదయాత్రకు రెడీ అవుతానని మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.ఇవే కాకుండా దళితబంధులో అక్రమాలు, సచివాలయ నిర్మాణంలో అవినీతి.. సచివాలయానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో అక్రమాలు లాంటి మరికొన్ని అంశాల్లోనూ తెలంగాణ సర్కార్ విచారణ ముమ్మరం చేస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏయే కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్నది.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య జనాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.