కరీంనగర్, నవంబర్ 11,
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. నేతల మాటలు కేవలం పార్టీల వరకే.. తెర వెనుక అంతా మామూలే. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ కొత్త వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే.. ఈటెల పాత గూటికి చేరుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అదెలా సాధ్యమంటారా? అందులోకి వచ్చేద్దాం. ఎంపీ ఈటెల రాజేందర్ గురించి చెప్పనక్కర్లేదు. సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఏ విషయానైనా ముక్కుసాటిగా మాట్లాడేతత్వం ఆయనది. బీజేపీ ఎంపీ అయిన తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు.. మాటలూ వినిపించలేదు. ఒకానొక దశలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయనకు వస్తుందని చాలా మంది భావించారు. కాకపోతే పార్టీ హైకమాండ్ నేతల కదలికలను క్షుణ్ణంగా గమనిస్తోందట. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీని బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నేతలతో ఎంపీ టచ్‌లోకి వెళ్లారన్నది అసలు సారాంశం. ఈ క్రమంలో పార్టీ ఆయన్ని పక్కనపెట్టిందని అంటున్నారు. పాదయాత్ర సందర్భంగా నకిలీ బీజేపీ నేతలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. గంగా, సబర్మతి నదులను వేల కోట్ల రూపాయలతో ప్రధాని మోదీ సుందరీకరణ చేస్తున్నారని అన్నారు. మూసీ పునరుజ్జీవం చేయవద్దా అంటూ ప్రస్తావించారు. ఈటెలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి.రేపో మాపో ఈటెల కారు ఎక్కబోతున్నారంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో కేటీఆర్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తే, దాన్ని భర్తీ చేసేందుకు ఆయన కారు ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఈటెల పైకి పార్టీ మారినట్టు కనిపించినా, ఆయనను బీజేపీలోకి కేసీఆర్ పంపించారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు. మొత్తానికి ఈటెలపై వస్తున్న ఈ పుకార్లు పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.