తిరుమల, నవంబర్ 12,
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి తొలి సమావేశం ఈనెల 18న జరగనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అందుకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు.ఈనెల 18న ఉదయం 10.15 గంటలకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన దాదాపు ఐదు నెలల తరువాత ఏర్పడిన టీటీడీ బోర్డు తొలి సమావేశం కావడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశం కోసం అధికారులు అజెండా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలను ప్రకటించనున్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. గత బోర్డు నిర్ణయాలపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది.టీటీడీ ఛైర్మన్ హోదాలో బీఆర్ నాయుడికి టీటీడీ అందించే సదుపాయాలను ఆయన తిరస్కరించారు. గతంలో ఛైర్మన్లకు భిన్నంగా బీఆర్ నాయుడు వ్యవహరించారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీ అందించే వాహనాలు, వసతి సదుపాయాలను సున్నితంగా పక్కనపెట్టారు. తిరుమలలో ఉన్నన్ని రోజులు సొంత వాహనాలను వినియోగించడంతో పాటు సహచరులు, బంధువులు ఉన్న వసతి గదుల అద్దెలు, భోజనం ఖర్చులను ఆయనే భరించారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడమే ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రాధాన్యతని.. బీఆర్ నాయుడు ఇటీవలి అన్నారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తాను చిన్నప్పటి నుండే ప్రతి సంవత్సరం శ్రీవేంకటేశ్వర స్వామిని కాలినడకన వచ్చి దర్శించుకునేవాడినని, ప్రస్తుతం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సేవ చేసుకునే అరుదైన అవకాశాన్ని శ్రీవారు ప్రసాదించడం పూర్వజన్మ సుకృతమన్నారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబరు 6 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరిరోజున భక్తులు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో వినాయక స్వామివారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగించారు.