విజయవాడ, నవంబర్ 12,
రాష్ట్రం మొత్తం వైసీపీ గాలివీచినా 2019లో విజయవాడ లోక్‌సభ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది .. 2014, 19 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ ఎంపీగా గెలిచారు . రెండో సారి గెలిచినప్పుడు తన షార్ట్ టెంపర్‌తో పార్టీలో అందరికీ దూరమయ్యారు. తన తమ్ముడు కేశినేని చిన్నికి పార్టీలో ప్రాధాన్యత లభిస్తుందన్న కోపం.. మరోసారి తనకు టికెట్ దక్కదన్న అక్కసులో పార్టీపై తిరుగుబాటు చేసి .. హడావుడిగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. విజయవాడ ఎంపీగా వైసీపీకి సరైన అభ్యర్ధి లేకపోవడంతో కేశినేని నానినే వారికి దిక్కయ్యారు..టీడీపీ నుంచి అనుకున్నట్లుగానే నాని తమ్ముడు కేశినేని చిన్ని టికెట్ దక్కించుకుని అన్నపై ఘన విజయం నమోదు చేశారు. దాంతో నాని రాజకీయ సన్యాసం ప్రకటించడంతో బెజవాడ పాలిటిక్స్‌లో ఆయన అధ్యయనం ముగిసింది. విజయవాడ తమ్ముళ్లు పార్టీకి కేశినేని నాని తలనొప్పి వదిలిందని ఆనందపడుతుంటే.. ఇప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని కేశినేని చిన్ని వారికి తలనొప్పిగా తయారయ్యారంట.విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీనే గెలిచింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారిందంట.. ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎంపీ చిన్నికి ఏదో రకమైన వివాదం కొనసాగుతోందట. తాను ఎంపీనని వందల కోట్లు ఖర్చుపెట్టి మిమ్మల్ని గెలిపించుకొని, తాను గెలిచానని.. కాబట్టి తాను చెప్పిందే చేయాలని చిన్ని హుకుం జరీ చేశారంట. జగ్గయ్యపేట, నందిగామ తిరువూరు, మైలవరం నియోజకవర్గం నేతలతో ఇసుక విషయమై ఎంపీ అవలంభిస్తున్న వైఖరి వివాదాస్పదంగా తయారైంది.కేశినేని పేరుతో ఆ నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద లారీలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయంట. ప్రతి లారీపై కేశినేని అని రాసి మరి ఇసుకను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని.. కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా వారితో కోఆర్డినేషన్ చేసుకోకుండా ఎంపీ చిన్ని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. దీంతో ఎమ్మెల్యేలు ఇటీవల అధినేతకి ఫిర్యాదు కూడా చేశారు.. దానిపై విచారణ జరిపించి మాట్లాడదామని చంద్రబాబు భరోసా ఇచ్చారంటున్నారు.ఎన్నికల ముగిసే వరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కలసి మెలసి తిరిగిన కేశినేని చిన్ని.. గెలిచిన తర్వాత ఒక కోటరిని ఏర్పాటు చేసుకొని దాంతో లోక్‌సభ సెగ్మెంట్‌ని శాసించాలని చూస్తున్నారంట. కార్యకర్తలు, నేతలు ఆయన్ని కలవాలంటే కోటరీ పర్మిషన్ తీసుకోవాలంట.. తిరుపతి వెంకన్న దర్శనం అన్న అవుతుందేమో కానీ విజయవాడ ఎంపీ దర్శనం కావట్లేదని పార్లమెంటు పరిధిలోని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గెలిచే వరకు నేనే మీరు మీరే నేను అన్న చిన్ని.. గెలిచిన తర్వాత మాత్రం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక ఇన్చార్జిని.. వారందరినీ కోఆర్డినేట్ చేయడం కోసం పార్లమెంట్ ఆఫీసులో మరికొందరితో ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి కార్యకర్తలకి అందుబాటులో లేకుండా పోయారంట. విజయవాడ నగరంలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకచోట బిజెపి గెలిచింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆశించిన స్థాయిలో ఎంపీ కి సత్సంబంధాలు లేకుండా పోయాయి.. ఏ కార్యక్రమమైనా ఎవరికి వారే చేసుకుంటున్నారు.ఇటీవల జరిగిన మద్యం టెండర్ల విషయంలో ఎమ్మెల్యేలకు, ఎంపీకి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు బెజవాడలో చర్చ నడుస్తుంది.. తనపై చంద్రబాబుకి లేనిపోని ఫిర్యాదులు చేశారని చిన్ని పై సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. ఇటీవల బెజవాడ వరదల సమయంలో చిన్ని చెప్పిందాన్ని బేస్ చేసుకుని అధికారులు, ప్రజల సమక్షంలో ఉమాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కూడా చిన్నికి సత్సంబంధాలు లేవంట .. సూపర్ సీనియర్ అవ్వడంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు తో మాత్రం అంతోఇంతో సయోధ్య కొనసాగిస్తున్నాంటున్నారు.2019లో వైసిపి గాలిలో కూడా టీడీపీని గెలిపించుకున్న బెజవాడ పై పార్టీ పెద్దలు ఫోకస్ చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు అంటున్నారు. వైసీపీ కార్పొరేటర్ లని చేర్చుకునే విషయంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరగకుండా ఎంపీ నేరుగా చేర్చుకున్నారంట. అదే విభేదాలన్నిటీ ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తుంది. మరి ఈ జూనియర్ కేశినేని తలనొప్పిని టీడీపీ పెద్దలు ఎలా సరిచేస్తారో చూడాలి.