YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ సారి కేడర్ కు ప్రాధాన్యం

ఈ సారి కేడర్ కు ప్రాధాన్యం

కడప, నవంబర్ 13,
వైసీపీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికలతో చాలా వరకూ డీలా పడిపోయారు. ఆయన ఊహించని అపజయాన్ని చవి చూశారు. ఆయన అంచనాలకు అందని ఓటమి ఇది. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కారణమని ఆయన చెబుతున్నప్పటికీ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమయింది. క్యాడర్ కూడా తమకు సరిగా సహకరించలేదని పూర్తిగా అర్థమయింది. సొంత జిల్లా కడపతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూటమి దాదాపు ఎక్కువ స్థానాలలో విజయం సాధించడంతో ఆయనకు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. కనీసం ఓటమికి గల కారణాలను వెతుక్కునేందుకు కూడా జగన్ సిద్ధపడటం లేదు. ఎందుకంటే ఏ కారణం వెతికినా.. చివరకు ఓటమికి ప్రధాన కారణం తనవైపు అన్ని వేళ్లు చూపిస్తుండటమేనని అనుకోవాలి. తన పోకడ వల్లనే వైసీపీ క్యాడర్ దూరమయిందని ఆయనకు తెలిసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని పదే పదే చెబుతున్నారు. సామాజిక వర్గాల నినాదం కూడా పనిచేయలేదు. అభ్యర్థులను మార్చినా ఫలితం మారలేదు. ఎన్ని కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో చెప్పిన సమయానికి జమ చేసినా ఈవీఎంల బటన్ మాత్రం తనకు అనుకూలంగా పడలేదు. దీంతో తాను చేసిన తప్పొప్పులను జగన్ లోలోపల సమీక్షించుకునే పరిస్థితికి వచ్చారు. మరోవైపు ఒంటరిపోరాటం కూడా ఓటమికి ఒక కారణంగా ఆయన చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి గట్టినప్పుడల్లా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఓట్లు బదిలీ జరగడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన విధంగా ఏర్పాట్లు, క్యాడర్ అందుబాటులో ఉండేందుకు పొత్తు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాల్చిన తర్వత జగన్ కూడా అర్థమయింది. అందుకే జగన్ ఆలోచనల్లో కూడా మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే కంటే పొత్తులతో కలసి వెళ్లడం మంచిదన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ప్రతిపక్ష బలం పెరగడం అటుంచి.. నైతికంగా మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై జగన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ తో చేతులు కలపలేరు. అలాగే కూటమిలో ఉన్న బీజేపీని బయటకు తెచ్చి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ చూపు వామపక్ష పార్టీలపై పడిందని చెబుతున్నారు. కొన్ని స్థానాలు ఇచ్చి కూటమి ఏర్పాటు చేసుకుంటే తనకు నైతిక బలం పెరుగుతుందని, వాయిస్ కూడా ఎక్కువవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే ప్రతిపాదన వారి నుంచి వస్తే జగన్ కాదనలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ మాత్రం నేరుగా వారి వద్దకు పొత్తుకు రా.. రా రమ్మని మాత్రం అడగరట. వామపక్షాలు వస్తామంటే కాదనరట. మరి పొత్తులతో వచ్చే ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం మాత్రం ఫ్యాన్ పార్టీలోనే జోరుగా సాగుతుంది.

Related Posts