YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజన్ సరే... రివిజన్ ఏదీ

విజన్ సరే... రివిజన్ ఏదీ

విజయవాడ, నవంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోకడలు ఒకవైపే ఉంటాయి. ఆయన 1995 లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి అంతే. ఆయన ధోరణిలో రాజీ ఉండదు. సంక్షేమం కన్నా ఆయనకు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధితోనే సంపదను సృష్టించగలమని బలంగా నమ్ముతారు. ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన తీరుమాత్రం మారదు. సంక్షేమానికి ఎంత ఖర్చు చేసినా వేస్ట్ అనే అభిప్రాయం ఆయనలో బలంగా ఉంటుంది. అదే అభివృద్ధి పనులు జరిగితే సంపద సృష్టి సులువుగా మారుతుందని భావిస్తారు. ఆయన విజన్ కూడా అంతే. ఇరవై ఏళ్లు ముందు ఉండి ఆలోచనలు చేసి వాటికి అనుగుణంగా నిర్ణయాలను అమలు చేస్తుంటారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం సంక్షేమంపై ఎక్కువగా మాట్లాడుతుంటారు.కానీ అధికారంలోకి రాగానే వెల్ఫేర్ ను పెద్దగా పట్టించుకోరు. లైట్ గా తీసుకుంటారు. ఆయన ఆలోచనలు ఎప్పుడూ హైఫైగానే ఉంటాయి. పేద, మధ్యతరగతి ప్రజలను గురించి పట్టించుకున్నట్లే కనిపిస్తున్నా వారికి అంతగా ఆయన పాలన ఉపయోగపడదన్నది అక్షర సత్యం. ఆయనదంతా సీ ప్లేన్.. డ్రోన్ ప్రపంచం.. అమరావతి నిర్మాణం.. పోలవరం పనులు ప్రారంభం వంటి వాటిపైనే ఎక్కవ ఫోకస్ ఉంటుంది. అంతే తప్ప తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి పెద్దగా ఆలోచన కూడా చేయరు. ఎన్నికల ఏడాది చివరి నాటికి మాత్రం దానిపైన ఆలోచిస్తారు.  ఖజానా ఖాళీ అంటూనే ఉంటారు. విద్యుత్తు ఛార్జీల భారం మోపుతారు. ఆ తప్పు నాది కాదంటారు. కానీ అదే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల అప్పులు తెచ్చి పనులు ప్రారంభిస్తామంటారు. ఈరెండింటినీ ప్రజలు కూడా బేరీజు వేసుకుంటారు. తమకు అందాల్సిన ప్రయోజనాలను కొన్నింటికే ఖర్చు చేయడాన్ని పెద్దగా ఎవరూ హర్షించరు. నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఇది తెలియంది కాదు. కానీ ప్రజలు తనను అర్థం చేసుకుంటారని గుడ్డిగా నమ్ముతుంటారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నా ఎవరూ చెప్పే సాహసం చేయరు. ఎందుకంటే ఆయన విజన్ ను ఎవరూ ప్రశ్నించలేరు. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ విజన్ ను తప్పుపట్టలేరు కానీ... చంద్రబాబు విజన్ ను ఎవరూ తప్పుపట్టలేరు. ఆయన రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి జరిగితే భవిష్యత్ తరాలకు తాము బంగారు బాట వేశామని భావిస్తారు. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని నమ్ముతారు. తాము మౌలిక సదుపాయాలను క్రియేట్ చేయగలిగితే డెవలెప్ మెంట్ దానికదే జరుగుతుందని బలంగా విశ్వసిస్తారు. అయితే చివరకు ప్రజలు అలా అనుకునే అవకాశం లేదు కదా? సహజంగా మార్పు కోరుకుంటారు. ఆయన విజన్ కు బ్రేకులు పడతాయి. కానీ మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ధోరణి అంతే. అందుకే చంద్రబాబు మారరు. ప్రజల్లో కూడా మార్పు రాదు. ఈ సైకిల్ ఇలా నడవాల్సిందే... అంతే మరి.

Related Posts