YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గాబ్యాంక్ దివాళ...

దుర్గాబ్యాంక్ దివాళ...

విజయవాడ, నవంబర్ 14,
విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న దుర్గా కోఆపరేటివ్‌ బ్యాంకు దివాళా తీసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆర్‌బిఐ లైసెన్స్‌ రద్దు చేసింది. బ్యాంకు మొండి బకాయిలు, వడ్డీలతో కలిపి రూ.200కోట్లకు చేరువలో ఉండటంతో ఆర్‌బిఐ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది.గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా రుణాలను మంజూరు చేయడం, ఆర్‌బిఐ మార్గదర్శకాలను పాటించకపోవడంతో బ్యాంకు దివాళా తీసేలా నిర్వహణ సాగింది. చివరకు ఆర్‌‌బిఐ విచారణలో బ్యాంకులో అవకతవకలు బయటపడటంతో లైసెన్స్‌ రద్దైంది. దీంతో డిపాజిటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకులో అధిక వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో డిపాజిట్లు చేసిన వారంతా లబోదిబోమంటున్నారు.విజయవాడ పాతబస్తీ దుర్గా కో- ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంకుకు ఆర్‌‌బిఐ అనుమతులు రద్దు చేయడం కలకలం రేపింది. బ్యాంకు నిర్వహణలో అవకతవకల పై కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాజకీయ జోక్యం అధికం కావడంతో బ్యాంకు డైరెక్టర్ల నియామకంలో చోటు చేసుకున్న అక్రమాలతో బ్యాంకు పరిస్థితి దయనీయం మారింది. 90ఏళ్ల చరిత్ర ఉన్న దుర్గా కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు గతంలో కూడా ఎన్నో ఉడిదుడుకులు ఎదుర్కొంది.తాజాగా రిజర్వ్ బ్యాంకు లైసెన్సు రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో బ్యాంకులో డిపాజిటర్లలో కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా రుణాల మంజూరులో బ్యాంకులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం, సరైన తనిఖీలు లేకుండా పట్టా భూములకు రుణాలు మంజూరు చేయడం, అవి తిరిగి వసూలు కాకపోవడం వంటి సమస్యలు బ్యాంకు ఎదుర్కొంటోంది. బ్యాంకు నిర్వహణపై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కొంత కాలంగా ఆర్‌బిఐ విచారణ జరుపుతోంది.బ్యాంకు లావాదేవీల నిర్వహణకు తగినన్ని నిల్వలు లేకపోవడంతో చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. డైరెక్టర్ల మధ్య విభేదాలతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్‌బిఐకు ఫిర్యాదులు అందాయి. 1926లో ఏర్పాటైన దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంకుకు ఘన చరిత్ర ఉంది. నగరంలోని నాలుగు స్తంభాల సెంటర్, సత్యనారాయణపురంలో బ్యాంకు శాఖలు ఉన్నాయి. దుర్గా కో- ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎన్నిక విజయవాడ రాజకీయాలను శాసించే స్థాయిలో జరిగేది. బ్యాంకు ఛైర్మన్ పదవిని దక్కించుకోడానికి ప్రధాన పార్టీలు పోటీపడేవి.కొన్నేళ్లుగా రాజకీయ జోక్యం మితిమీరడంతో బ్యాంకు పతనం దిశగా పయనించింది. బ్యాంకులో మొండి బకాయిలు పెరిగిపోయాయి. డిపాజిట్లు చేసిన వారికి కూడా గడువు ముగిసినా చెల్లింపులు చేయలేని స్థితికి బ్యాంకు చేరింది. దీంతో ఖాతాదారులు పలుమార్లు ఆందోళ నకు దిగారు. బ్యాంకు రుణాల జారీలో ఉద్యోగులు, పాలక మండలి డైరెక్టర్ల చేతివాటంతో పారుబకాయిలు పెరిగిపోయాయి. బ్యాంకు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని గతంలో కో ఆపరేటివ్ రిజస్ట్రార్‌ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చినా ప్రజా ప్రతినిధుల అండతో చర్యలు నిలిచిపోయాయి. చివరకు ఆర్‌బిఐ అనుమతి రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో డిపాజిటర్లలో ఆందోళన నెలకొంది.బ్యాంకు డిపాజిటర్లలో దాదాపు 95శాతం మంది రూ.5లక్షల్లోపు డిపాజిటర్లు కావడంతో వారికి దశల వారీగా చెల్లింపులు జరుపనున్నట్టు ఆర్‌బిఐ అధికారులు వివరించారు. ఐదేళ్ల లక్షలకు పైబడిన డిపాజిట్లపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు దగ్గర తగిన మూల ధనం లేకపోవడం, బ్యాంకు నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం లైసెన్స్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిది. బ్యాంక్ కార్యకలాపాలు అనుమతిస్తే డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆర్‌బిఐ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిపే స్థితిలో దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్ లేదని ఆర్‌బిఐ వెల్లడించింది.2024 నవంబర్ 12 తర్వాత బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోతాయని ప్రకటించింది. బ్యాంకును మూసివేసి లిక్విటేడర్‌ను నియమించాలని కమిషనర్‌ ఆఫ్‌ కో ఆపరేషన్‌ అండ్ రిజస్ట్రార్ ఆప్‌ కో ఆపరేటివ్స్‌ సొసైటీని ఆర్‌బిఐ సూచించింది. లిక్విడేషన్‌లో ప్రతి డిపాజిటర్‌కు డిపాజిట్‌పై బీమా క్లెయిమ్‌ చెల్లిస్తారు. డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా గరిష్టంగా ఐదు లక్షల వరకు చెల్లిస్తారు. బ్యాంకు రికార్డుల ప్రాకరం డిపాజిటర్లలో 96శాతం మంది ఈ పరిహారం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. డిపాజిట్లలో పూర్తి మొత్తాన్ని డీఐసీజీసీ నుంచి పొందుతారని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది. ఐదు లక్షలకు మించిన డిపాజిట్లపై కసరత్తు చేస్తున్నారు.

Related Posts