ఒంగోలు, నవంబర్ 14,
ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో ఈనెల 10న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు కావడం.. ఏపీలో సోషల్ మీడియా రగడను కొత్త మలుపు తిప్పేసింది. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 19న విచారణకు హాజరుకావాలంటూ వర్మకు నోటీసులు వెళ్లాయి. ఎస్‌ఐ శివరామయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ హైదరాబాద్‌లోని వర్మ ఆఫీసుకు వెళ్లి స్వయంగా నోటీసులు హ్యాండోవర్ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్, బ్రహ్మణిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం.ఎన్నికలకు ముందు, టీజర్ ట్రైలర్లతోనే సంచలనం సృష్టించిన మూవీ వ్యూహం. అప్పట్లో ఆ సినిమా విడుదల ఆపాలంటూ కోర్టును కూడా ఆశ్రయించింది టీడీపీ. ఈ సినిమా సెన్సార్‌ను తెలంగాణా హైకోర్టు రద్దు చేసినా, డివిజన్ బెంచ్‌లో వర్మ సవాల్ చేయడంతో మరోసారి సినిమా మీద రివ్యూ జరిగింది. బెంగుళూరు సెన్సార్‌బోర్డు U సర్గిఫికెట్ ఇవ్వడంతో సినిమా థియేటర్లలో రిలీజైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా RGV మీద కేసు నమోదైంది. రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు FIR నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులోనూ నోటీసులిచ్చే అవకాశం ఉంది. దేనిమీదైనా.. ట్విట్టర్‌లో తనదైన స్టయిల్‌గా రియాక్టవడం వర్మకు అలవాటు. కానీ.. ఏఐ వీడియోలతోనో, అమెరికా ఎన్నికల ఫలితాల మీదో టైమ్‌పాస్ చేస్తున్నారు తప్ప.. తనమీద నమోదౌతున్న కేసుల పరంపరపై వర్మ ఖాతాల్లో చిన్న ప్రస్తావనైనా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు కేసుల్ని తేలిగ్గా తీసుకుంటారని, వీలైతే ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు ఆయన ఫాలోయర్లు.నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూడా ఏపీలో కేసు నమోదైంది. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. 2021 సెప్టెంబర్‌లోనూ, 2024 ఏప్రిల్‌లోనూ వైసీపీ కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. పోసాని మాటల్ని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో పెట్టి.. పవన్‌కల్యాణ్ ప్రతిష్టను దెబ్బతీశారన్నది కంప్లయింట్ సారాంశం. ఐపీసీ సెక్షన్ 153, 153a, 354a, 505 క్లాజ్ 1, క్లాజ్ c, క్లాజ్ 2 ప్రకారం వర్మపై కేసు నమోదైంది. కానీ.. తాను పవన్ కల్యాణ్‌పై తప్పుడు వ్యాఖ్యలేమీ చేయలేదని, తాను చెప్పినవన్ని నిజాలేనని రియాక్టయ్యారు పోసాని.కానీ.. పవన్‌నుద్దేశించి పోసాని దారుణమైన పదజాలంతో పరుషంగా మాట్లాడారని వాదిస్తోంది జనసేన. గతంలో కూడా పోసానిపై ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు. అటు.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసుల పరంపర కొనసాగుతోంది. జనసేన, టిడిపి నేతల ఫిర్యాదులతో పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మందిపై గరిష్టంగా ఐదు కేసులు పెట్టారు. 22 మందికి 41ఏ నోటీసులిచ్చి పంపారు. మిగిలినవారు జిల్లా జైళ్లలో ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పీఎస్‌లో కంప్లయింట్ నమోదైంది. కూటమి నేతలపై ఆమె చేసిన సీరియస్ కామెంట్లను ఫిర్యాదులో జతపరిచారు.పోలీసుల అదుపులో ఉన్న వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం ఆధారంగా.. సజ్జల భార్గవ్ సహా ఐదుగురు వైసీపీ నేతలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు ఐదు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి. అటు.. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. అటు.. హోమ్‌మంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో అరెస్టు చేశారు పోలీసులు. ఫేక్ అకౌంట్లతో వాళ్లమీద వాళ్లే పోస్టులు పెట్టుకున్నారని, పోలీసులు మాత్రం తమను టార్గెట్ చేస్తున్నారని వాపోతోంది వైసీపీ.అటు.. కేసులను, అరెస్టులను తీవ్రంగా తీసుకున్న వైసిపి అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ.. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని చట్టబద్ధంగానే అరెస్టు చేస్తున్నామంటూ సమర్థించుకుంటోంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ స్పందించాలని, వైసీపీ గుర్తింపు రద్ధు చెయ్యాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ.