YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓరుగల్లులో మరో ఐదు మున్సిపాలిటీలు- ప్రభుత్వం కసరత్తు

ఓరుగల్లులో మరో ఐదు మున్సిపాలిటీలు- ప్రభుత్వం కసరత్తు

వరంగల్ నవంబర్ 14,
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రేటర్ వరంగల్ తో పాటు ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉండగా..త్వరలో మరో ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా.. తొందర్లోనే మరో ఐదు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. కొద్దిరోజుల కిందట ప్రతిపాదిత మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా.. ఆఫీసర్ల ప్రపోజల్స్ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కూడా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెలువరించిన అనంతరం కొత్త మున్సిపాలిటీలు మనుగడలోకి వచ్చే అవకాశం కనిపిస్తుండగా.. అందులో కొందరు విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీల ఏర్పాటుకు విముఖత చూపుతుండటం గమనార్హం.ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదివరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా.. దాంతో పాటు హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీలున్నాయి. ఇదిలాఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రపోజల్స్, ఆబ్జెక్షన్స్ తీసుకున్న మున్సిపల్ శాఖ.. ఆ తరువాత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించింది. కాగా దాని ప్రకారం ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న మున్సిపాలిటీల వివరాలు ఇలా ఉన్నాయి..
హనుమకొండ జిల్లాలో..
ఆత్మకూరు మున్సిపాలిటీ.. హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా డెవలప్ చేసేందుకు అడుగులు వేస్తుండగా.. ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు ఇదే మండలంలోని తిరుమలగిరి, గూడెప్పాడ్, కామారం నీరుకుళ్ల, పెంచికలపేట, దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామాలను విలీనం చేసి ఆత్మకూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు.
వరంగల్ జిల్లాలో..
నెక్కొండ మున్సిపాలిటీ.. నెక్కొండ మండల కేంద్రంతో పాటు గుండ్రపల్లి, అమీర్ పేట, నెక్కొండ తండా, టీకే తండా
మహబూబాబాద్ జిల్లాలో..
కేసముద్రం మున్సిపాలిటీ.. కేసముద్రం టౌన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి గ్రామాలు
జనగామ జిల్లాలో..
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ.. ఛాగల్లు, స్టేషన్ ఘన్పూర్, శివునిపల్లి గ్రామాలు
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నప్పటికీ ఇంతవరకు దానికి మున్సిపాలిటీగా హోదా మాత్రం దక్కలేదు. దీంతోనే ఈసారి ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ములుగుతో పాటు బండారుపల్లి, జీవంత రావుపల్లి గ్రామాలను కలిపి ములుగు మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది.
గ్రామాల్లో వ్యతిరేకత
ప్రస్తుతం పంచాయతీలుగా కొనసాగుతున్న గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా.. విలీన గ్రామాల్లో చాలాచోట్లా ప్రజలు విలీనానికి వ్యతిరేకంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఆత్మకూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అంతటా వ్యతిరేకంగానే అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రతిపాదించిన మిగతా మున్సిపాలిటీల్లో కూడా చాలా వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలిసింది. పట్టణికీకరణ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ప్రజల అభ్యంతరాలు వ్యక్తమైన చోట ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Related Posts