హైదరాబాద్, నవంబర్ 15,
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు తీపి కబురు.. ఏటా నవంబర్‌లో పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడం ప్రహసనంగా ఉంటుంది. వృద్ధాప్యంలో పెన్షనర్ బతికే ఉన్నామంటూ ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో పెన్షనర్లు బ్యాంకుల్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి వచ్చేది. ఆధార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్నేళ్లుగా జీవన్ ప్రమాణ్‌లో బయో మెట్రిక్ నమోదు చేస్తున్నారు. పిపిఎఫ్ ఖాతాలతో ఆధార్ సంఖ్యను అనుసంధానించి వాటి ఆధారంగా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను అమోదిస్తున్నారు.
ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్...
పెన్షనర్లు నడవగలిగిన స్థితిలో ఉంటే ఫర్లేదు కానీ వయసు మళ్లిన వారికి మాత్రం లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించడం పెద్ద శ్రమే అవుతోంది. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్, ఉడాయ్‌లు సంయుక్తంగా ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించే అవకాశం కల్పిస్తున్నాయి. ఐరిస్ ద్వారా ఇందులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.
పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచి లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. మొబైల్ ఫోన్ ఉంటే చాలు సొంతంగా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించడాని అనుమతిస్తున్నారు.
పెన్షనర్ మొదట తమ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్‌ను తమ ఫోన్లో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అందులో తమ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది.
తర్వాత జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో ఆపరేటర్ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పెన్షనర్‌నే ఆపరేటర్‌గా పరిగణించాలి.
చివరగా పెన్షనర్ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు జీవన్ ప్రమాణ్ యాప్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆధార్ కార్డు, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుతో అనుసంధానించి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ అందుతుంది.
డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పించడానికి పెన్షనర్ పేరు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలాల్సి ఉంటుంది. పెన్షన్ రకాన్ని వెల్లడించాలి.
పెన్షన్ జారీ చేసిన వివరాలను నమోదు చేయాలి. ఎవరి ద్వారా పెన్షన్ అందుకుంటున్నారో పేర్కొనాలి.
తర్వాత పిపిఓ నంబర్‌ను ఎంటర్ చేయాలి. పెన్షన్ అకౌంట్ నంబర్ తెలుపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ వివరాలను ధృవీకరిస్తున్నట్టు టెక్ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్‌మిట్ బటన్ నొక్కాలి. లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా సమర్పిస్తే మొబైల్ నంబర్‌కు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్టు సందేశం అందుతుంది.
కెమెరా నాణ్యత స్పష్టంగా ఉండాలి...
ఇంటి నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేయడానికి మొబైల్ కెమెరా నాణ్య బాగుండాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ రివ్యూలను బట్టి కేవలం నాణ్యమైన మొబైల్ కెమెరాలతో మాత్రమే ఫేస్ రికగ్నేషన్ సాధ్యమవుతున్నట్టు ఈ యాప్‌లను ఇప్పటికే వినియోగించిన వారు పేర్కొన్నారు. ప్లే స్టోర్ రివ్యూలో ఎక్కువ మంది సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు.యాప్‌లో మొబైల్ కెమెరాను ముఖానికి దగ్గరగా కంటి పాపను గుర్తించేలా పెట్టినపుడు మాత్రమే ఉడాయ్ ఫేస్ ఆర్‌డి యాప్ పనిచేస్తున్నట్టు పలువురు ఫిర్యాదు చేశారు. ఫేస్ యాప్‌గా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను పేర్కొన్నప్పటికి ఐరిస్ ఆధారంగా ఇవి పనిచేస్తున్నట్టు ప్లే స్టోర్ రివ్యూల ఆధారంగా తెలుస్తోంది.