YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియా వారియర్స్ కు చుక్కలు

సోషల్ మీడియా వారియర్స్ కు చుక్కలు

కడప, గుంటూరు, నవంబర్ 18,
ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకుని చేతిలో సెల్, అందులో ఇంటర్ నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తల దాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేల. ఇప్పుడు క్షమాపణలు చెప్పనేల అన్నట్లుగా సీన్ మారింది. తెలిసో తెలియకో చేశాం.. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో అని చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడకపోవడంతోనే సమస్య వచ్చింది. ప్రత్యర్థులపై హేట్ పోస్టులతో రెచ్చిపోయారు. అదే అన్నిటికీ మందు అనుకున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. నోటీసులు, కేసులు, అరెస్టులతో అందరిలోనూ పరేషాన్ కనిపిస్తోంది. ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే అందరినీ గుర్తు పట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కట్టు దాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్ అవుతున్నారు. BNSS సెక్షన్ 111 ప్రయోగిస్తుండడంతో చాలా మంది కాళ్లబేరానికి వస్తున్నారు.మంచి పనులు చేస్తూ ప్రజల్లో మెప్పు పొంది గెలవాలి. కానీ ప్రత్యర్థులను టార్గెట్ చేసి, వారి భార్యలపై వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా పబ్బం గడుపుకొందామంటే కుదురుతుందా.. కానే కాదు అని ఇప్పటి కేసులు, అరెస్టులు రుజువు చేస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పుట్టలో ఉన్నా సరే వెతికి వెతికి బయటకు తీస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్ గా పని చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అంతా జైలు బాట పడుతున్నారు.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని, వాటిని అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు సోషల్ వారియర్లు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించడం అందరూ ఆలోచించాల్సిన విషయం. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది ధర్మాసనం. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నది. సో హైకోర్టు చెప్పాల్సింది చెప్పేసింది. ఇది నిజంగా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బే.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. పైగా రివర్స్ అవుతోంది. ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత తప్పించుకుందామని చూసినా.. చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది ఇప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన వారికి, ఆ పార్టీ సానుభూతి పరులకు అర్థమవుతోంది. నిజానికి ఈ విషయంలో మొదటే జ్ఞానోదయం కావాలి. కానీ ఇన్నాళ్లకు అవుతోంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే గెట్ రెడీ అంటోంది ఏపీ పోలీస్ వింగ్. వీళ్లు రాజకీయ విమర్శలతో పోస్టులు పెట్టి ఉంటే అంతా బాగుండేది. కానీ హద్దులు దాటి పెట్టారు. అందుకే వరుసగా నోటీసులు, కేసులు, అరెస్టులు.

Related Posts