తిరుపతి, నవంబర్ 18,
ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన మాజీ సీఎం.. రీసెంట్ గానే ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్ లను ప్రకటించారు. పార్టీని మళ్లీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాలతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ.. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. ఫ్యాన్ పార్టీని కలవర పెడుతుందట. పార్టీ 2027 లోనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తల ముందు గొప్పలు పోతూ.. తమలో విభేదాలు లేవని చెబుతున్నారు. కానీ మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్తులు ఉండే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మళ్లీ మైత్రి కుదురుతుందా అని జోరుగా చర్చ జరుగుతోందట. ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బయటకు వచ్చింది. తర్వాత అయనను రాయలసీమ జిల్లాల బాధ్యుడిగా నియమించి.. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టారు. వాస్తవానికి గడిచిని 5ఏళ్ల కాలంలో నాలుగేళ్ల పాటు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన కరుణాకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదని టాక్ నడిచింది. అయినప్పటికీ హాడావుడిగా భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సభకు విజయసాయిరెడ్డి, సజ్జల, అంబటి.. ఎస్వీ సుబ్బారెడ్డితో పాటు జిల్లాలోని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, సోదరుడు మినహా మిగతా నాయకులు అంతా హాజరవడం చర్చనీయాంశంగా మారుతోందట. ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వచ్చి కరుణాకర్ రెడ్డికి శాలవ కప్పి సన్మానించారు. తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ప్రమాణ స్వీకారం రోజు పెద్దిరెడ్డి సభకు రాకపోవడంతో.. నాయకుల మధ్య మైత్రి బంధంపై అధికార పార్టీ నేతలకే కాకుండా.. సొంత పార్టీ నేతలకు సైతం అనుమానాలు కలిగిస్తున్నాయట. పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి, నగరి టార్గెట్ గా పనిచేశాడనే వాదనలు ఉన్నాయట. చెవిరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి పెద్దిరెడ్డి అనుచరుడు అయిన ఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట. దాంతో వారి మధ్య నాటి నుంచి ఇష్యూ చాప్య కింద నీరులా సాగుతుందని ఫ్యాన్ పార్టీ నేతలే గుసగుసలాడు కుంటున్నారట. జగన్ అధికారంలో ఉన్న అయిదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఒక రేంజ్లో నడిచింది… రాయలసీమ జిల్లాల్లో అనధికార సీఎంగా ఆయన చెలామణి అయ్యారట. జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి సొంత కేడర్ ఉందట. సొంత పార్టీలో తనకు నచ్చని నేతలను ఓడించడానికి పెద్దిరెడ్డి తన సైనాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయట. ఇక మాజీ డిప్యూటీ సియం నారాయణ స్వామి పెద్దిరెడ్డి మీదా కత్తులు నూరుతున్నారంట. తన కూమార్తె ఓటమి కారణం పెద్దిరెడ్డి రాజకీయం అని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోను తన అనుచరులు ఉన్న పెద్దిరెడ్డి పూర్తి సహాకారం అందించక పోతే భూమన అధ్యక్షుడిగా చేసేదేమి లేదని చర్చ జరుగుతుందట. అయితే ఇప్పటికే గ్రూపులు గ్రూపులుగా విడిపోయిన ఉన్న వైసీపీ క్యాడర్ నేతల మధ్య ఇష్యూతో కలపడం మరింత కష్టమే అంటున్నారట.