YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ సుప్రీం పై కొనసాగుతున్న చర్చలు

గులాబీ సుప్రీం పై కొనసాగుతున్న చర్చలు

హైదరాబాద్, నవంబర్ 18,
సమీప భవిష్యత్తులో తాను కార్యకర్తల కోరిక మేరకు తెలంగాణలో పాదయాత్ర చేపడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం ఇప్పుడు ఆ పార్టీలో సంచలనంగా మారింది.  ఒంటరిగా ఈ యాత్ర చేస్తారా..
అలా చేస్తే పార్టీ సుప్రీం తనేనా.. కేటీఆర్ పాదయాత్ర చేస్తే పార్టీలో ఏం జరగనుంది. కేసీఆర్ కూడా ఇదే కోరుకుంటున్నారా. పార్టీ పెట్టిన నాటి నుండి  గులాబీ పార్టీలో సుప్రీం కేసీఆర్ మాత్రమే. కేటీఆర్  తాను పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయమా.. లేక కేటీఆర్ స్వంత నిర్ణయమా అన్న చర్చ సాగుతోంది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్  రాజకీయంగా అంతగా చురుకుగా లేకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజే హజరు కావడం , రైతు సమస్యలపై ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం మినహా ప్రస్తుతం ఆయన రాజకీయ మౌనం వహిస్తున్నారు. ఈ తరుణంలో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీలో సీనియర్ నేత హరీశ్ రావులే అన్నీ తామై  పార్టీ కార్యక్రమాలు చక్కబెడుతున్నారు.  కాంగ్రెస్, బీజేపీ పార్టీల విమర్శలకు వారే దీటుగా స్పందిస్తున్నారు.  కేసీఆర్ మౌనంగా ఏం కూర్చోలేదని, రానున్న రోజుల్లో చురుకైన పాత్ర పోషించేందుకు  రాజకీయ వ్యూహా రచనలో  ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే తాను ఎలా తిరిగి ప్రజల్లోకి వస్తారు. ఏ అంశాలపై ఆయన స్పందిచనున్నారు అన్న చర్చ సాగుతున్న తరుణంలో కేటీఆర్ చేసిన పాదయాత్ర వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీలో ఇప్పటికే కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పాత్ర ఎక్కువ ఉండేది.  అధికారం కోల్పోయాక కేసీఆర్ మౌనంగాను, కేటీఆర్ చురుకుగాను వ్యవరిస్తున్న సమయంలో కేసీఆర్ ఇక రాజకీయాల నుండి విశ్రమించి పూర్తి బాధ్యతలు  కేటీఆర్ కు అప్పగించునున్నారా ?. అందుకు పాదయాత్ర ద్వారా వేదిక సిద్దం చేస్తున్నారా ? అన్నప్రశ్నలు రాజకీయవర్గాల్లో తలెత్తుతున్నాయి. ఇంతకు ముందు  పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావ్, కవితలదే పూర్తి హవా నడిచేది. అయితే రెండో దఫా అధికారంలోకి వచ్చాక హరీశ్ రావుకు ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం, అదే తరుణంలో కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా కేటీఆర్ తదుపరి రాజకీయ వారసుడు అన్న స్పష్టత ఇచ్చారు కేసీఆర్.  ఆ తర్వాత హరీశ్ రావుతో పాటు కేటీఆర్ కు ఒకే సారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.అయితే అప్పటి నుండి పార్టీ వర్కింగ్ ప్రసిడెండ్ గా కేటీఆర్  పని చేస్తూ పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూ పొజిషన్ తనదే అని చెప్పకనే చెప్పారు. మరో వైపు హరీశ్ రావు సైతం మంత్రిగాను, పార్టీ సీనియర్ గా ప్రజల్లోను అటు పార్టీ కార్యకర్తలు, నేతలతో చురుకుగా పని చేస్తూ తన ఇమేజ్ ను కాపాడుకుంటూనే వచ్చారు. పార్టీలో ఇంకా తాను ట్రబుల్ షూటర్ గానే పని చేస్తూ కేసీఆర్  ఇచ్చిన టాస్క్ ఏదైనా చక్కబట్టె పనిలో ఉన్నారు. ఇక కవిత విషయానికి వస్తే లిక్కర్ కేసులో తన పేరు వచ్చినప్పటి నుండి కొంత బ్యాక్ స్టెప్ వేస్తున్నారు.  లిక్కర్ కేసులో జైలు నుండి విడుదల అయిన తర్వాత జరిగిన ర్యాలీ, ఆ ర్యాలీలో  తన కమ్ బ్యాక్ మరింత  గట్టిగానే ఉంటుందని  ప్రకటించారు. అయినా కొద్ది రోజులుగా కేసీఆర్ తోపాటే  కవిత కూడా రాజకీయ మౌనం పాటిస్తున్నారు .సహజంగా పాదయాత్రలు ఎన్కకలకు ఏడాది ఉండగా  ఆయా పార్టీ అధినేతలు చేయడం రివాజు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వై.ఎస్ జగన్ ఇలా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన వారే. అయితే  వచ్చే సార్వత్రిక ఎన్నికల బాధ్యతలు కేసీఆర్ కేటీఆర్ కు అప్పగిస్తారా అన్న చర్చ కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత పార్టీలో నడుస్తోంది. అదే జరిగితే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏం చేయనున్నారు అన్నిద ఓ ప్రశ్న. తదుపరి.. సీనియర్ గా పార్టీలో అన్ని సమయాల్లో  ఉన్న  హరీశ్ రావు కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లోనే హరీశ్ రావు సరిగా పార్టీ వినియోగించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో కేటీఆర్ ను, రూరల్ ప్రాంతాల్లో హరీశ్ రావును తిప్పి ఉంటే గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి కాదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో హరీశ్ రావు పాత్ర రానున్న రోజుల్లో ఎలా ఉండనుందన్న చర్చ సాగుతోంది. 
కేటీఆర్ ఒక్కరే పాదయాత్ర చేస్తారా.. లేక  హరీశ్ రావు కూడా పాదయాత్రలో పాల్గొంటారా.. ఇద్దరూ కలిసి చేస్తారా.. లేక  వేర్వేరుగా చేస్తారా... అన్న సందేహాలు పార్టీ నేతల్లో ఉన్నాయి.ఇదే తరుణంలో పార్టీలో కీలకంగా   ఉన్న కవిత ఏం చేయనున్నారు. పార్టీలో ఏం బాధ్యతలు అప్పగిస్తారు. లిక్కర్ కేసు నేపధ్యంలో ఆమె రాజకీయ అడుగులు ఎలా ఉండనున్నాయి. అయితే కేటీఆర్ పాదయాత్ర అనేది పార్టీని బలోపేతం చేస్తుందా.. లేక   వర్గాలుగా  మార్చి బలహీనం చేస్తుందా అన్న సందేహాలు లేకపోలేదు.  అయితే వీటన్నింటిపైన కేసీఆర్ ఏం మాట్లడనున్నారా అన్నది కూడా  ఉత్కంఠకు  దారి తీస్తుంది. ఇది కేసీఆర్ సూచనతో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక తాను స్వంతంగానే పాదయాత్ర ప్రకటన చేశారా అన్నదానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది.   అయితే వీటన్నింటికి   ఎన్నికల ముందు  మాత్రమే సమాధానాలు దొరకనున్నాయి.  కేటీఆర్ వ్యాఖ్యలపై పార్టీలో కీలక నేతలు హరీశ్ రావు, కవితల స్పందన ఏంటో కూడా వేచి చూడాల్సి ఉంది. కేటీఆర్ ప్రకటనను వారు ఖండిస్తారా.. సమర్థిస్తారా.. లేక అవకాశం కోసం వేచి చూస్తారా అన్నది కూడా చూడాలి. రాజకీయాల్లో చాలా సమస్యలకు చిక్కు ముడి విప్పేది కాలమే. సమయం వస్తే తప్ప ఎవరూ బయటపడరు. అలాగే అటు హరీశ్ రావు, కవితలు పార్టీలో సీనియర్లు కావడంతో వారి స్పందన అంత  ఈజీగా బయపట్టే టైపు కాదు. కాబట్టి  ఈ పాదయాత్ర పార్టీని ఏ తీరం చేర్చుతుందో, మిగతా నేతల స్పందన ఏంటో తెలియాలంటే కొద్ది కాలం వేచి చూడక తప్పదు.

Related Posts