YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శాసనమండలికి బాలినేని

శాసనమండలికి బాలినేని

ఒంగోలు, నవంబర్ 19,
మొన్న కాంగ్రెస్, నిన్న వైసీపీ, నేడు జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నేనెక్కడున్నా రాజా.. రాజానే అనే రీతిలో ఉంది ఆ నేత పాలిటిక్స్ తంత్రం. ఇంతలా చెప్పాక ఆ నేత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదుగా.. ఆయనేనండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయానా మాజీ సీఎం జగన్ కు సమీప బంధువు కూడా. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల మధ్య బాలినేని ఇటీవల జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన బాలినేనికి, ఆదిలో కొంత అవరోధాలు స్వాగతం పలికాయి. కారణం ఒంగోలుకు చెందిన టీడీపీ నేతలు, జనసేనలో బాలినేని చేరికకు అడ్డు చెప్పడమే. అయినా తన పని తాను చేసుకుపోయినట్లు బాలినేని పార్టీలో చేరే ఘట్టం కూడా పూర్తయింది. కాంగ్రెస్, వైసీపీ లలో ఉన్న సమయంలో బాలినేని, మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాలినేని, జనసేనలో చేరగా ఒంగోలు టీడీపీ నేతలకు మింగుడు పడలేదనే చెప్పవచ్చు. కారణం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని, తమను వేధించారన్నది స్థానిక టీడీపీ నాయకుల వాదన.ఇప్పుడు జనసేనలో చేరి సైలెంట్ గా, నియోజకవర్గానికి దూరమై హైదరాబాద్ లో ఉంటున్నారు బాలినేని. కానీ ఆయన ఏమీ ఆశించకుండా ఉండే రకం కాదన్నది పొలిటికల్ టాక్. అందుకే జనసేనలో చేరిన బాలినేనికి, పవన్ ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారట. ఆ హామీని త్వరలోనే నిలబెట్టుకొనేలా పవన్ చక్రం తిప్పుతున్నారట. త్వరలో ఎమ్మెల్యేల కోటా కింద భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవులలో జనసేనకు ఒకటి, కూటమి కేటాయించనుంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి బాలినేనికి ఖరారైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ఉండగా, బాలినేని ఎమ్మెల్సీ పదవిని స్వీకరిస్తే అక్కడ ఒక్క ఒరలో ఏ మేరకు రెండు కత్తులు ఇమడుతాయో వేచి చూడాలి. కాగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలు లో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది.ఏదిఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం, ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి క్యాడర్ బలోపేతం అవుతుందని బాలినేని అభిమానులు తెలుపుతున్నారు. మరి ఇంతకు బాలినేని కి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా అన్నది త్వరలోనే బహిర్గతమయ్యే రాజకీయ స్థితిగతులు ఉన్నట్లు పొలిటికల్ టాక్.
బాలినేని చేరికపై అనుమానాలు
బాలినేని జనసేనలో చేరిక వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఆయన వైసీపీ కోసమే జనసేన లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. కూటమిలో విభేదాలు పుట్టించేందుకు ఆయన జనసేనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన చేరిక పూర్తయింది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకి కొత్త ఇన్చార్జి వచ్చారు.. చండూరు రవి అనే వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. అన్నింటికీ మించి బలమైన క్యాడర్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం జనసేన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని వైసీపీ ఇన్చార్జిగా నియమించడం విశేషం. ఈ నియామకం వెనుక బాలినేని ప్రయోజనం దాగి ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇప్పటికీ వైసీపీ ఇన్చార్జిగా బాలినేనినే భావిస్తోందట అధిష్టానం.బాలినేని బలపడితే పార్టీ బలపడుతుందని భావిస్తోందట. అందుకే బాలినేనికి ఇబ్బంది లేకుండా చుండూరు రవి అనే సామాన్య నేతను వైసీపీ ఇన్చార్జిగా నియమించినట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఒంగోలు వైసిపి క్యాడర్ అంతా బాలినేని వెంట ఉంది. అలాగని వారంతా జనసేన అభిమానులు కాదు. ఆ పార్టీకి పనిచేయరు. అందుకే ఇప్పుడు బాలినేని బలహీనం చేయకుండా ఉంచేందుకు జగన్ రవి అనే కొత్త వ్యక్తిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

Related Posts