హైదరాబాద్, నవంబర్ 19,
గట్టిగా పోరాడాం. ఎదురేలేదన్న బీఆర్ఎస్‌ను ఓడించాం. కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం. పవర్‌లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం. అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు. దీనంతటికి కారణం ఏంటన్నదానిపై చర్చోపచర్చోలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతో చేస్తున్నా.. అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆరు గ్యారెంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మధన పడుతున్నారట.అధికారంలో ఉన్నా చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడిపోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా..ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తోందట తెలంగాణ ప్రభుత్వం.మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, వరి పంటకు 500 రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది కాంగ్రెస్. ఇక మహిళా సంఘాలకు దాదాపు 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇచ్చామంటున్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభిస్తున్నారట. ఈ ఏడాది కాలంలో దాదాపు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవేవీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి.ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 80శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని.. మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా..అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం. ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారట. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3వేల 500 ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడికి 5 లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్దం చేస్తున్నారట. రైతు భరోసా విధివిధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయల ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట. కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 26 రోజుల పాటు పెద్దఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజా విజయోత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.