YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కమలంలో కన్ఫ్యూజన్....

కమలంలో కన్ఫ్యూజన్....

హైదరాబాద్, నవంబర్ 19,
8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు కేంద్రమంత్రులు..ఓ రేంజ్‌లో హవా ఉండాల్సింది పోయి..అపోజిషన్‌ డైరెక్షన్‌లో నడుస్తుందట ఆ పార్టీ. ఎప్పుడు ఏ ఇష్యూను ఎత్తుకోవాలో..ఏ సమస్య మీద పోరాడాలో తేల్చుకోలేకపోతున్నారట. పబ్లిక్‌లో ఒక సమస్య మీద చర్చ జరుగుతుంటే..ఆ పార్టీ నేతలు పాత సమస్య మీద నిరసన తెలుపుతున్నారట.బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు బీజేపీ దూకుడే వేరు. కేసీఆర్‌ను ఓడించి తామే అధికారంలోకి వస్తామన్నంతగా ఫైట్ చేశారు కమలం లీడర్లు. సీన్‌ కట్‌ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఎక్కువే ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద పోరాడాల్సినంత గట్టిగా పోరాడటం లేదని బీజేపీ క్యాడరే అసంతృప్తిగా ఉన్నారట. మూడు, నాలుగు నెలలుగా సమస్య ఒకటి అయితే.. బీజేపీ పోరాడుతోన్న ఇష్యూ మరొకటిగా మారుతోంది. ఒక సమస్యపై హాట్ హాట్‌ చర్చ జరుగుతుంటే మరొక సమస్యను కమలనాథులు భుజాన వేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఏ ఇష్యూను ఎప్పుడు ఎత్తుకోవాలో కమలం లీడర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందట. తెరమరుగైన సమస్యపై పోరాటానికి కార్యాచరణను తీసుకుంటున్నారట. దానికి ఉదాహరణగా చాలా సమస్యలను పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారట.ఆగస్టు నెలలో రాష్ట్రమంతా రైతు రుణమాఫీపై చర్చ జరుగుతున్న సమయంలో.. బీజేపీ నేతలంతా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నిమగ్నం అయ్యారు. ఆలస్యంగా రైతు సమస్యలపై ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేశారు బీజేపీ నేతలు. బీజేపీ నేతలు రైతు సమస్యలపై ధర్నా చేస్తున్నప్పుడు రాష్ట్రంలో హైడ్రా ఇష్యూ పీక్స్‌లో ఉంది. కానీ అప్పుడు ఆ సమస్యను పట్టించుకోకుండా రైతుల అంశంపై పోరాటాలు చేశారు బీజేపీ నేతలు. ఇక హైడ్రాపై పోరాటాలు చేయాల్సిన సమయంలో గ్రూప్ వన్ వాయిదా వేయాలంటూ ఛలో సెక్రటేరియట్ నిర్వహించారు. గ్రూప్ వన్ విద్యార్థుల కోసం ధర్నా చేయాల్సిన సమయంలో మూసీ అంశాన్ని ఎత్తుకుని ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టారు.ఇప్పుడు లేటెస్ట్‌గా రాష్ట్రమంతా లగచర్ల ఫార్మా సిటీ అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ..ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసే కార్యాచరణ తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పడుకుంటే మీకు బాధ తెలుస్తుందన్న సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు స్పందించింది. మూసీ ఏరియాల్లో 20 చోట్ల 20మంది నేతలు బస చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా మేల్కొనడానికి కారణం లేకపోలేదంటున్నారు పార్టీ నేతలు. ఒకవైపు జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమన్వయం చేసుకుని పోరాటాలు చేయడంలో వెనకబడుతున్నారట రాష్ట్ర బీజేపీ నేతలు. అందువల్లే సమస్య ఒకటైతే బీజేపీ చేసే పోరాటం మరొకటి ఉంటుందని పార్టీ కార్యాలయంలోనే టాక్ వినిపిస్తుంది. ఇంతగా బీజేపీ నేతలు బిజీగా ఉండేలా జాతీయ నాయకత్వం అప్పజెప్పిన కార్యాచరణ ఏంటీ అంటే. సభ్యత్వ నమోదు. ఇదే మూడు నెలలుగా పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీజేపీలో ఏ ఇద్దరు నేతలు కలుసుకున్న ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మీరు ఎన్ని సభ్యత్వాలు చేయించారంటే.. మీరెన్ని చేయించారని..పార్టీ మెంబర్ షిప్‌ డ్రైవ్‌ మీద ఫోకస్ పెట్టారట నేతలు. ఏ జిల్లాలో ఎక్కువ సభ్యత్వ నమోదు జరిగింది.? ఏ ఎంపీ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు అయ్యాయనే అంశంపై పార్టీ నేతలంతా దృష్టి పెట్టారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం కావడంతో..లేటెస్ట్‌ రాజకీయ పరిణామాలపై పోరాడటానికి కోఆర్డినేషన్ మిస్‌ అవుతోందట. ఇప్పుడు ఇదే కారణంతో మూసీపై సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను ఆలస్యంగా స్వీకరించారు.

Related Posts