విజయవాడ, నవంబర్ 20,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు సర్వం తానే అయి వ్యవహరించారు. ఐ ప్యాక్ తో పాటు అభ్యర్థుల ఎంపిక, వారికి ఆర్థిక వనరుల సమకూర్చడం.. బీఆర్ఎస్ తో సమన్వయం చేసుకుని టీడీపీని ఇబ్బంది పెట్టండ వరకూ మొత్తం ఆయనే చేశారు. అందుకే రిజల్ట్ వచ్చినప్పుడు మొదటగా జగన్ .. విజయసాయిరెడ్డిని హగ్ చేసుకుటున్న ఫోటోనే బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం మీడియా వ్యవహారాలు చూసేవారు. కానీ పార్టీ గెలిచిన తర్వాత అందరూ వెనుకబడిపోయారు. సజ్జల ముందుకు వచ్చారు. విజయంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు వెళ్లిపోయారు. ముఖ్య సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా జగన్ దగ్గర పలుకుబడి పెంచుకున్నారు. ఎంతగా అంటే ఆయన చెబితేనే ఏదైనా జరుగుతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సకల శాఖల మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ ను కలవనీయకుడా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఇంచార్జుగా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి తన కుమారుడ్ని నియమించుకున్నారు. ఇలా మొత్తంగా ఆయనే కీలకం అయ్యారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దాంతో సహజంగా అయనదే బాధ్యతని అందరూ విమర్శించడం ప్రారంభించారు. అత్యదిక మంది సీనియర్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీని డీల్ చేసిన వైనంపై అసంతృప్తితో ఉన్నారు. రాజకీయాలపై అవగాహన లేకుండా చేసినట్లుగా ఉందని ఆ కారణంగా ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి సజ్జల వల్లే వచ్చిందని .. ఇప్పుడు ఆయనను మళ్లీ ఇంచార్జ్ గా నియమిస్తే తాము ఎలా రాజకీయాలు చేయాలని వారంటున్నారు. ఎంతటి సీనియర్లు అయినా మీడియా ముందు మాట్లాడాలంటే సజ్జల ఆఫీసు నుంచి స్క్రిప్ట్ రావాల్సిందేనని.. లేకపోతే మాట్లాడవద్దని చెబుతారని అంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పార్టీపై ఉన్నంత కాలం... అంటీముట్టనట్లుగా ఉంటేనే మంచిదని చాలా మంది సీనియర్లు అభిప్రాయానికి రావడంతో ఎవరి వాయిస్ ఇప్పుడు మీడియా ముందు వినిపించడం లేదు.