విజయవాడ, నవంబర్ 20,
ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. చంద్రబాబుకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే అరెస్టు చేసిన కేసు అది. ఆ తర్వాత ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదన్న విషయం బయటపడింది. ఇప్పుడు ఆ స్కిల్ కేసు మొత్తం ఫేక్ అని.. నాటి ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ డీజీపీకి లేఖ రాశారు. తన వాంగ్మూలం ఆధారంగానే అరెస్టు చేసినట్లుగా కోర్టుకు చెప్పారు.కానీ తన వాంగ్మూలం అంతా ఫేక్ అని... దీనిపై విచారణ చేయాలని ఆయన లేఖ రాశారు. మరో వైపు పీవీ రమేష్ రాసిన లేఖ విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో చర్చించారు. స్కిల్ కేసులో ఉన్న మొత్తం కుట్రను బయటకుతీయాలని ఆయన డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడానికి ప్రధాన కారణంగా చంద్రబాబు హయాంలో ఐఏఎస్‌గా పని చేసిన పీవీ రమేష్ వాంగ్మూలం కీలకం. డబ్బులు రిలీజ్ చేయాలని చంద్రబాబు ఒత్తిడి చేశారని నిబంధనలను అతిక్రమించమని ఆయన చెప్పారని పీవీ రమేష్ చెప్పినట్లుగా సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే పీవీ రమేష్ తాను అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని..అంతా స్వయంగా జరిగిందని చెప్పానని తాజాగా డీజీపీకి లేఖ రాశారు. ఆ కేసులో సీఐడీ అధికారులకు తానిచ్చిన స్టేట్ మెంట్ కాపీ తన వద్ద ఉందన్నారు. ఈ కేసు విషయంలో ఏం జరిగిందో సమగ్ర విచారణ చేయాలని పీవీ రమేష్ లేఖలో కోరారు. స్కిల్ కేసులో అసలు ఏం జరిగిందో చెప్పడం కన్నా.. తప్పుడు ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా పెట్టారు. కానీ ఈ అంశంపై ఆడిటింగ్ చేసిన సంస్థ సీమన్స్ కంపెనీ అన్నీ ఒప్పందం ప్రకారం సరఫరా చేసిందని.. కొన్ని వేల మంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పలేదు. అది ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆడిటింగ్ చేసిన సంస్థ కుట్ర చేసిందని డిజైన్ టెక్ సంస్థ ఐసీఏఐలో ఫిర్యాదులో చేసింది.అలాగే ఇందులో ఒక్క రూపాయి కూడా చంద్రబాబుకు లేదా టీడీపీకి చేరాని కోర్టుకు చెప్పలేకపోయారు. టీడీపీ సభ్యత్వ రుసుము లెక్కలు కూడా చూశారు.చివరికి ఎలక్టోరల్ బాండ్ల లెక్కలుకూడా బయటకు వచ్చాయి. ఈ స్కిల్ కేసులో ఉన్న కంపెనీలేవీ టీడీపీకి విరాళాలివ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి స్కాం చేస్తే కనీసం నోటీసులు ఇచ్చి విచారణ చేసి..ఆధారాలు ఉంటే అరెస్టు చేస్తారు.కానీ కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండా ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆ పని చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించాల్సిన వ్యవస్థలు కూడా అచేతనమయ్యాయి. ఈ కారణంగా యాభై రోజులకుపైగా చంద్రబాబు జైల్లో ఉండాల్సి వచ్చింది.ఇప్పుడీ కేసులో ఎవరి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెబుతోందో..ఆయన వాంగ్మూలం ట్యాంపర్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలోనూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో డీజీపీ ఈ అంశంపై విచారణ జరిపితే.. చాలా మంది ఐపీఎస్‌లు.. నాటి రాజకీయ నేతలతో చేసిన కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.