YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు

- ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌...
- జనవరి 31న ఆర్థిక సర్వే
- సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ పూర్తిస్థాయి బడ్జెట్‌
- బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత
- రెబల్‌ జడ్జిలు,పద్మావత్‌పై హాట్‌ హాట్‌ !
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు  నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన 2018-19 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సభలో ప్రవేశపెట్టనున్నారు. అందుకు ఒకరోజు ముందుగా అంటే జనవరి 31న కేంద్ర ఆర్థిక సర్వేను జైట్లీ సభ ముందుంచనున్నారు. ఉభయసభలనుద్దేశించి సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసే ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 29న ప్రారంభమయ్యే ఈ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగియనున్నాయి. ఇక రెండో దఫా బడ్జెట్‌ సమావేశాలు మార్చి 5న ప్రారంభమై ఏప్రిల్‌ 6వ తేదీతో పూర్తికానున్నాయి. మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో పాటు ఓబీసీ కమిషన్‌ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలన్న పట్టుదలతో ఉంది. కాగా ఈ సమావేశాల్లో పద్మావత్‌ అంశంతో పాటు సుప్రీంకోర్టు జడ్జీల విషయం పార్లమెంట్‌ను కుదిపేయనుంది. మరోవైపు ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం కోరింది. ఇందుకు నేడు(ఆదివారం) రెండు అఖిలపక్ష సమావేశాలకు పిలుపునిచ్చింది. పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్‌ నేతృత్వంలో ఒకటి, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన మరోకటి సమావేశం జరగనుంది. కాగా కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యమవుతున్నాయి. 


2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గానికి కొన్ని మినహాయింపులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80-సీ పరిమితిని పెంచాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. అదే సమయంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో మొదటి దఫా సమావేశాల్లోనే గట్టెక్కించాలన్న పట్టుదలతో ఉంది. ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిని పాటించిన వారికి మూడేండ్ల జైలు శిక్ష విధించాలన్న కేంద్ర నిర్ణయంపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. ఇక ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును సైతం ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలిసారి ఉభయసభలనుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. 
ప్రతిపక్షాల సమావేశం...
కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. బీజేపీ సర్కారు అవలంబిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. విపక్షాల సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే జనవరి 26వ తేదీన ముంబయిలో 'రాజ్యాంగం పరిరక్షించండి' అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి సీపీఐ నేత డీ రాజాతో పాటు శరద్‌ యాదవ్‌, ఒమర్‌ అబ్దుల్లా, సుశీల్‌కుమార్‌ షిండే, దినేష్‌ త్రివేది, హార్ధిక్‌పటేల్‌ తదితరులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో 29వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
తుఫాను సృష్టించనున్న పద్మావత్‌, రేబల్‌ జడ్జిల అంశం...
బడ్జెట్‌ పార్లమెంట్‌ మొదటి దఫా సమావేశాల్లో సుప్రీంకోర్టు రెబల్‌ జడ్జీల అంశంతో పాటు పద్మావత్‌ వ్యవహారం తుఫాను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా పద్మావత్‌ సినిమా విడుదల విషయంలో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు, కర్ణిసేన విధ్వంసకాండపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. ప్రతిపక్షాలు రేబల్‌ జడ్జిల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చేలా పావులు కదుపుతున్నాయి.

Related Posts