విజయనగరం, నవంబర్ 21,
కిమిడి నాగార్జున.. ఉమ్మడి విజయనగరం రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019లో చీపురుపల్లిలో టీడీపీ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున.. వైసీపీ వేధింపులను తట్టుకుంటూ అయిదేళ్లు అక్కడ బొత్స అక్రమాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2014లో అదే చీపురపల్లి నుంచి బొత్సపై గెలిచి మంత్రిగా పని చేసిన కిమిడి మృణాళిని రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఆయన గత ఎన్నికల్లో విజయం సాధించడానకి పెద్ద కసరత్తే చేశారు.విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జిల్లాలో బొత్స ఆధిపత్యానికి గండి కొట్టడానికి అలుపెరుగని పోరాటం చేసిన కిమిడి నాగార్జునకు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖాయమని, ఖచ్చితంగా ఆ యువనేత. బొత్సాకి చెక్ పెడతారని తెలుగుతమ్ముళ్లు భావించారు. అయితే ఎన్నికలు వచ్చేసరికి పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు రూపంలో ఎమ్మెల్యే టికెట్ కి అడ్డుపుల్ల పడింది. తనను కాదని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన కళా వెంకట్రావుకి చీపురుపల్లి టికెట్ ఇవ్వడంతో నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నారా లోకేశ్ టీమ్‌లో మెంబర్ అయిన నాగార్జున అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డారు . చంద్రబాబే తమ నాయకుడంటూ.. స్టార్ క్యాంపెయినర్‌గా ఉత్తరాంధ్రలో ప్రచారం చేశారు . పార్టీ అధికారంలోకి వచ్చింది . నాగార్జున నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అని భావించారు . ఫస్ట్ లిస్టులోనే కిమిడి నాగార్జున పేరుంటుందని ఆయన అనుచరులు ఆశగా ఎదురు చూశారు. అయితే నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. ఎన్నికల ముందు నాగార్జునకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ..దీంతో ఉమ్మడి జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో ఆయన ఫ్యూచర్‌పై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.ఎక్కడ చూసినా నాగార్జునకి మళ్ళీ అన్యాయం జరిగింది అన్న చర్చ మొదలయింది . విజయనగరం యాస లో చెప్పలంటే పాపం ఆ గుంటడికి మళ్ళీ అన్యాయం జరిగింది. ఈ సారీ ఏటీ ఇవ్వలేదు. నిజంగా పని సేసినోడికి ఎపుడూ న్యాయం జరగదు. ఆల పెదనాన్న కళా వెంకటరావు గానీ సెడ గొడతండేటి అని నాగార్జునపై తెగ జాలి కురిపించేస్తున్నారు. మరోవైపు నాగార్జున ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఎక్కడా కనపడటం లేదు. పూర్తిగా విశాఖకే పరిమితమై, అపుడప్పుడూ జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలో జిల్లాల జరిగే కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు.నాగార్జున చీపురుపల్లికి రాకపోవడానికి ఎమ్మెల్యే తనయుడి హోదాలో కిమిడి కళా వెంకటరావు కొడుకు రామ్‌మల్లిక్ నాయుడు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉండడమే అంటున్నారు . కళా వెంకట్రావు పూర్తిగా రాజాంలో పూర్తిగా మకాం వేస్తే.. రామ్‌మల్లిక్ నియవజకవర్గంలో వ్యవహారాలు చక్కపెడుతున్నారంట . దాంతో అభిప్రాయ భేదాలు ఎందుకులే అనుకున్నారేమో.. నాగార్జున చీపురుపల్లి వైపు కన్నెత్తి చూడడం మానేశారు. ఓ పక్క ఎమ్మెల్యే టికెట్ లేదు, మరోవైపు నామినేటెడ్ పదవీ లేదు , ఇంకో వైపు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేదు. దీంతో నాగార్జున భవిష్యత్తుపై జిల్లా వ్యాప్తంగా తెగ చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకి సరైన సమయంలో సరైన పదవి కట్టబెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలతో మమేకమయ్యే పదవినే ఇస్తారు తప్ప , కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు లాంటివి ఆయన సత్తాకి సరైనవి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్ పదవి ఆయననే వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది.జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అదే సరైన పదవి అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి . ఒకవేళ జడ్పీ ఛైర్మన్ పదవి రిజర్వ్‌డ్ కోటాలోకి వెళ్లే ఎమ్మెల్సీగా అవకాశం దక్కొచ్చని ఆయన అనుచరవర్గం లెక్కలు వేసుకుంటుంది. . చట్టసభలకి వెళ్లాలని అమెరికాలో ఉద్యోగం కూడా వదులుకొని , పార్టీకోసం శ్రామికుడిలా పని చేసిన నాగార్జునకి కూటమి ప్రభుత్వం ఎలాంటి పదవి కట్టబెడుతుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. చూడాలి చంద్రబాబు, లోకేష్ లు నాగార్జునను హీరోని చేస్తారో , జీరోగా మిగుల్చుతారో.