YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో 44 మంది అన్యమతస్తులు

తిరుమలలో 44 మంది అన్యమతస్తులు

నెల్లూరు, నవంబర్ 21,
తిరుమల తిరుపతి దేవస్థానం  ఈ మధ్య తీసుకున్న కీలక నిర్ణయాలలో అన్యమతస్తుల తొలగింపు ఒకటి. తిరుమలలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న అన్యమతస్తులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వానికి ఓ సూచన చేసి అలాంటి వారిని గుర్తించి కీలక నిర్ణయం తీసుకోనుంది. తిరుమలలో పని చేస్తున్న అన్యమతస్తులను వేర్వేరు శాఖలకు పంపించడమా లేకుండా వారికి వీఆర్‌ఎస్ ఇవ్వడమా అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఈ నినాదం వినిపిస్తూనే ఉంది. కానీ ఇంత వరకు ఏ ప్రభుత్వం, ఏ టీటీడీ పాలక మండలి కూడా సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టలేదు. కానీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే టీటీడీ ఎంపిక జరిగిందని అంటున్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఎంపికైన బీఆర్‌నాయుడు తొలి మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి అన్యమతస్తుల తొలగింపు. దీంతో అసలు తిరుమల వ్యాప్తంగా ఈ అన్యమతస్తులు ఎంత మంది ఉన్నారు. వారు ఎక్కడెక్కడ పని చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అన్యమతస్తులను తొలగించాలన్న నిర్ణయం ఇప్పుడు కొత్తగా తీసుకున్నది మాత్రం కాదు. 2007లోనే  హిందువులు కాని వారిని తిరుమలకు సంబంధించిన ఉద్యోగులుగా నియమించకూడదని ఉత్తర్వులు వచ్చాయి. కొత్త నియామకం అయ్యే వారి మత విశ్వాసాలపై ఎంక్వయిరీ చేసి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కూడా అందులో ఉంది. టీటీడీలో భారీ స్థాయిలో అన్యమతస్తులు లేరని అంటున్నారు. తిరుమలలో దాదాపు 7,000 మంది వరకు శాశ్వత ఉద్యోగులు ఉంటే... 14,000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉంటారు. వీరిలో కేవలం 40 నుంచి 50 మంది వరకు మాత్రమే హిందూయేతరులు ఇంటారని చెబుతున్నారు. వీళ్లు అసలు తిరుమల పరిసరాల్లో పని చేయరని తిరుమల ఆలయ ప్రాంగణానికి వెలుపల ఆసుపత్రులు, బడుల్లో పని చేస్తూ ఉంటారట. 1989 అక్టోబర్ 24 నుంచి వచ్చిన టీటీడీ సర్వీస్‌ రూల్స్‌లో హిందూయేతరులను చేర్చుకోవద్దని 2007లో తీర్మానించారు. అప్పటి నుంచి అన్యమతస్తులను చేర్చుకోవడం తగ్గిపోయింది. అప్పటి వరకు నియమితులైన వాళ్లు ఇంకా కొనసాగుతున్నారు. వారిలో చాలా మంది పదవీ విరమణ తీసుకున్నారు. 2017లో నాటి ఓ అధికారిని చర్చిలోకి వెళ్లడం వివాదంగా మారింది. ఆమెపై హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. హిందూ సంఘాల ఒత్తిడితో గతంలోనే టీటీడీ ఓ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో కేవలం 44 మంది మాత్రమే అన్యమతస్తులు ఉన్నారని వారిలో 39 మంది 2007 కంటే ముందే రిక్రూట్ అయ్యారని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కారుణ్యనియామకాల కింద రిక్రూట్ అయిన వాళ్లుగా చెప్పుకొచ్చింది. డోర్ టు డోర్ సర్వే చేసి తేల్చిన లెక్క ఇదని టీటీడీ వెల్లడించారు. 44 మంది హిందూయేతర ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది టీటీడీ. వీరంతా డ్రైవర్లు, అటెండర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. నోటీసులపై వాళ్లంతా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి టీటీడీ ఇచ్చిన నోటీసులపై ఫిబ్రవరి 2018లో స్టే ఇచ్చింది. ఈ తీర్పుతో మతం ఆధారిత నియామకాలు చెల్లుబాటు అవుతాయా కాదా అనే చర్చ మొదలైంది. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే హిందూయేతర టీటీడీ ఉద్యోగులను తొలగిస్తామని అప్పటి ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. తర్వాత అది అమలుకు నోచుకోలేదు. తర్వాత ఇదే విషయంపై వైసీపీ ప్రభుత్వాన్ని, అప్పటి టీటీడీ ఛైర్మన్‌లను బీజేపీ, హిందూ సంఘాలు టార్గెట్ చేశాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో కొత్త బోర్డు ఏర్పాటుతో అన్యమతస్తులను తొలగించాలని నిర్ణయించారు. కోర్టు తీర్పు అమలులో ఉండగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో అన్న ఆసక్తి నెలకొంది.

Related Posts