ఒంగోలు, నవంబర్ 21,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలవడం కాదు.. గెలిచిన నాటి నుంచి వచ్చే ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మిత్రపక్షాలకు కేటాయించిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ బలపడే విధంగా అన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశముంది. నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 225 నియోజకవర్గాలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అవతరించనుంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కంటే అదనంగా మరో యాభై శాసనసభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి... దీంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. తమ పార్టీని క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఆయన ఇప్పటి నుంచే ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారికి కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్యాగాలు చేసి పార్టీ కోసం సహకరించిన వారిని పార్టీ వదులుకోదని బలమైన సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. అదే సమయంలో సీనియర్ నేతలకు చెక్ పెట్టి కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. సీనియర్లను పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని, పార్టీ సేవలకు వారు ఉపయోగపడతారని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో చంద్రబాబు నేతలకు, క్యాడర్ కు కూడా ఇప్పటి నుంచే స్పష్టత ఇచ్చే పనిని చేపట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మూడు పార్టీలు కలసి పోటీ చేస్తాయని పదే పదే చెబుతున్నారు. అంటే జమిలి ఎన్నికలు జరిగినా, 2029 లో సాధారణ ఎన్నికలు జరిగినా.. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయని ఆయన చెబుతూ వస్తున్నారు. అంటే ఎవరేమనుకున్నా సరే తాను మాత్రం పొత్తులతోనే ముందుకు వెళతానని ఆయన తెగేసి చెబుతున్నారు. కూటమితోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నేతలు ఎవరూ వ్యతిరేకించే పరిస్థితి లేకపోయినా కొంత అసంతృప్తి అయితే నేతల్లో ఇప్పటి నుంచే మొదలయింది. గత ఎన్నికల్లో మిత్ర పక్షాలకు కేటాయించిన నియోజకవర్గాలను వాటిని వదులుకునే పరిస్థితి లేదు.. ఉన్న వాటిని వదులుకోకపోగా, కొత్తగా మరికొన్ని స్థానాలను మిత్రపక్షాలను కోరే అవకాశం లేకపోలేదు. చంద్రబాబు కూడా అందుకు తలొగ్గక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తిరిగి మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా నిలువరించాలంటే కూటమితో కలసి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆయన నేతలు ఎవరు ఉన్నా, వెళ్లిపోయినా పెద్దగా కేర్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఆయన ముందు నుంచే మానసికంగా నేతలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోసారి తాను అధికారంలోకి వచ్చి వైసీపీని పూర్తిగా రాష్ట్రంలో భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఏమేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.