ముంబాయి
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20 శాతం వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.
అదానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఏసీసీ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20%, అదానీ ఎంటర్ ప్రైజెస్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ విల్మార్ 10%, అదానీ సిమెంట్స్ 12% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయినట్లు ఫార్చ్యూన్ కథనంలో పేర్కొంది. ఈ గ్రూపులో పెట్టుబడిదారు అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్స్ షేర్లు కూడా 25 % కుంగినట్లు సీఎన్బీసీ పేర్కొంది.