విజయవాడ, నవంబర్ 23,
భారతీయ జనతా పార్టీ త్వరలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చనుంది. తెలుగు రాష్ట్రాలకూ కొత్త అధ్యక్షులు రానున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఏపీలోనూ అధ్యక్ష పదవి మార్చాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీలోని అత్యున్నత నిర్ణాయక కమిటీ ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరిపి నలుగురు పేర్లను షార్ట్ లిస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లుకాగా.. మరో ఇద్దరు ఆరెస్సెస్ నుంచి పార్టీ కోసం పని చేస్తున్న యువనేతలు ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ బీజేపీ ప్రస్తుత అధ్యక్షరాలు పురందేశ్వరికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి ఆమె మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా పురందేశ్వరికి పగ్గాలు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చురుగ్గా పని చేసే యువనేతకు చాన్స్ ఇస్తే.. పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అద్యక్ష పదవిని మార్చాలని డిసైడైన తర్వాత పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించి.. సామాజికవర్గ సమీకరణాలను వడపోసిన తర్వాత నలుగురు పేర్లను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ నలుగురులో ఇద్దరు సీనియర్లు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి ఇద్దరు ఉపాధ్యక్షులైన యువనేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, అనుభవం, పార్టీపై విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్షుడిని ఖరారు చేయనున్నారు. సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి సుదీర్ఘ కాలం ఇతర పార్టీల్లో పని చేసి వచ్చారు. వారికి బీజేపీ భావజాలంపై ఎంత పట్టు ఉందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అదే సమయంలో వారికి చాన్సిస్తే బీజేపీని సిద్దాంతపరంగా అంటి పెట్టుకుని ఉండే క్యాడర్ ఎంత వరకు పని చేస్తారో చెప్పలేమన్న అభిప్రాయాలు ఎక్కువగా హైకమాండ్‌కు చేరుతున్నట్లుగా తెలుస్తోంది.పైగా వారు ఎమ్మెల్యేలుగా బాధ్యతల్లో ఉన్నారని..వారికి ఉన్న ఇతర వ్యాపకాలతో పార్టీకి పూర్తి సమయం కేటాయించడం కష్టమన్న వాదన కూడా ఉంది.ఇక రేసులో ఉన్న ఇద్దరు యువనేతలు, ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ విషయంలో మాత్రం పెద్దగా అభ్యంతరాలు హైకమాండ్‌కు ఎవరూ చెప్పడం లేదంటున్నారు. వారిద్దరూ మొదటి నుంచి ఆరెస్సెస్, బీజేపీతో పెరిగారు. ఆరెస్సెస్ భావజాలంతో రాజకీయాలు చేస్తున్నారు. ఆరెస్సెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువనేతలు .. ఇద్దరరికీ వేరే వ్యాపకాలు లేవు కాబట్టి పూర్తి స్థాయి సమయం పార్టీకి కేటాయిస్తారు. అదే సమయంలో ఏబీవీపీలోనూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో చురుకైన పాత్ర కూడా పోషించారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ అధికార కూటమిలో ఉంది. ఈ సమయంలో కింది స్థాయి నుంచి విస్తృతంగా పర్యటిస్తూ.. పార్టీని బలోపేతం చేసేది యువనేతలేనని ఎక్కువ మంది హైకమాండ్‌కు చెబుతున్నారు. చాలా కాలంగా ఏపీలోరెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పించలేదు. అదే సమయంలో ఆ వర్గం నుంచే బీజేపీకి ఎక్కువ సపోర్టుగా ఉన్నారు. రాయలసీమలో రెడ్డి వర్గం మద్దతుతో గతంలో మంచి ఫలితాలు సాధించేది. అలాగే రాయలసీమ ప్రాంతానికి కూడా ఏపీ బీజేపీ చీఫ్ పదవి కేటాయించలేదు. ఇవన్నీ చూస్తే రాయలసీమ ప్రాంతానికి చెంది.. సామాజికవర్గ సమీకరణాలు కలసి వచ్చే విష్ణువర్ధన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.