లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వారసత్వ పోరు పెరిగింది. లాలూ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. పార్టీ వ్యవహారాలను చూసే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. చిన్నవాడైన తేజస్వీయాదవ్ ఇటీవల కాలంలో చురుగ్గా వ్యవహరించడం తేజ్ ప్రతాప్ కు నచ్చడం లేదు. ఇద్దరు రాజకీయాల్లో ఉండటంతో ఆధిపత్య పోరు పెరిగింది.పార్టీ వ్యవహారాలను తనకు తెలియకుండా చక్కపెడుతుండటం, ఉప ఎన్నికల సమయంలోనూ తనను దూరంపెట్టడంపై తేజ్ ప్రతాప్ యాదవ్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం ఉంది. దీనికి తోడు తేజస్వీ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ చెప్పినట్లే తేజస్వీ నడుచుకుంటున్నాడని తేజ్ ప్రతాప్ యాదవ్ అభిప్రాయపడుతున్నారు. దీంతో తన తమ్ముడితో ఈ విషయంపై ఆయన చర్చించారు. పార్టీ నుంచి తనను తప్పించే కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ కొందరిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని కూడా తేజ్ ప్రతాప్ తప్పు పడుతున్నారు. వారివల్లే పార్టీ భ్రష్టు పడుతుందన్న ఆవేదన ఆయన ఈ చర్చల్లో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని తేజస్విని కొద్దిగా గట్టిగానే మందలించినట్లు సమాచారం. అయితే తన తమ్ముడిపై ప్రేమ ఉందని, పార్టీ అభివృద్ధి కోసమే తాను, సోదరుడు పనిచేస్తామని, ఆర్జేడీలో జరుగుతున్న పరిణామాలు తనకు విచారం కలిగించన మాట వాస్తవమేనని తేజ్ ప్రతాప్ యాదవ్ అంటున్నారు. మొత్తం మీద అన్నదమ్ముల మధ్య వార్ టీ కప్పులో తుఫానులా ముగిసిపోతుందా? పెద్దదవుతుందా? అన్నది చూడాలి.