పెద్దపల్లి ప్రతినిధి:
ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సన్నాలకు బోనస్ ఎంత పడిందో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు.
శుక్రవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, అదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి రైతుల జిల్లా అని , ఇక్కడ పరిస్థితులు చాలా సున్నితంగా ఉంటాయని, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం చేస్తున్న పని క్షేత్రస్థాయిలో రైతులను కనెక్ట్ అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుం దని, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి రైతు ఎంత లబ్ధి పొందుతున్నాడు వివరాలతో గ్రామాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సన్న రకం వడ్లకు బోనస్ పడుతుంది అనే అంశం రైతులకు తెలిసేలా చేయాలని, ప్రతి రోజు సన్న రకం వడ్ల బోనస్ ఎంత వస్తుందో ప్రచారం కల్పించాలని అన్నారు. మనం చేసే కష్టం క్షేత్రస్థాయిలో అందరికీ తెలియజేయాలని మంత్రి పేర్కొన్నారు. రైస్ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్ షీట్ జనరేట్ అయ్యే విధంగా చూడాలని, రైతులకు ఎక్కడ కోతలు విధించడానికి వీలు లేదని మంత్రి తెలిపారు. రైతులను ఎట్టి పరిస్థితులలో దోపిడీకి గురి చేయడానికి ఆస్కారం ఇవ్వవద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో దాదాపు ఇప్పటివరకు 80 శాతం మేరకు దాన్యం నగదు చెల్లించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. జిల్లాలో 51 వేల 827 రైతులకు 372 కోట్ల 59 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు. ఫ్యామిలీ గ్రూపింగ్, రేషన్ కార్డ్ వంటి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులకు కూడా త్వరలో రుణమాఫీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం 82 శాతం మేర సన్న రకం వడ్ల పంట వస్తుందని అన్నారు. రైతులకు సన్న రకం వడ్ల బోనస్ వల్ల అధికంగా లబ్ది చేకూరుతుంద ని అన్నారు. జిల్లాలో తేమ శాతం వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి 24 గంటల వ్యవధిలో రైస్ మిల్లులకు తరలించి ఓపిఎంఎస్ వెబ్ సైట్ లలో నమోదు చేస్తున్నామని , ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని అన్నారు.
యూనియన్ బ్యాంకు లో 3 వేల రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి ,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ , జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.