హైదరాబాద్, నవంబర్ 23,
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మేల్యేల చేరికలు ఇంకా ఉన్నాయా.. మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు సుముఖంగా ఉన్నారా.. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ ఇందుకు ఊతమిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ చేరికలు కూడా అతి త్వరలోనే ఉంటాయని మహేష్ గౌడ్ ప్రకటించడం విశేషం. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీని అరెస్ట్ చేస్తే, ప్రధాని మోడీ రాజీనామా చేయక తప్పదని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి వారిని పెంచి పోషిస్తుందని మహేష్ గౌడ్ విమర్శించారు. అలాగే రాహుల్ గాంధీ గతంలోనే చెప్పారని, అదానీకి లాభం చేకూర్చే స్థితిలో కేంద్రం ఉందని చెప్పారన్నారుఈ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందని, అదానీ గ్రూప్ విచ్చలవిడిగా సంపద పెంచుకునేందుకు ప్రధాని అండదండలు ఉన్నాయన్నారు. అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ వేసి విచారణ జరపాలన్నారు.ఇక తెలంగాణ రాజకీయ అంశాలపై మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని, అది కూడా కేటీఆర్ తో తిరుగుతున్న ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల చేరికల అంశం వివాదాస్పదం అవుతుండగా, స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారన్నారు.తమ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యేలు తమవైపు వస్తున్నారని, త్వరలోనే ఎంతమంది టచ్ లో ఉన్నారన్నది మీడియాకే తెలుస్తుందని మహేష్ గౌడ్ అన్నారు. ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే త్వరలో మరో మారు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని భావించవచ్చు. మరి మహేష్ గౌడ్ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.