YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

తెలుగోళ్లకు డిప్యూటీ ఛైర్మన్

తెలుగోళ్లకు డిప్యూటీ ఛైర్మన్
తెలుగు వ్యక్తికి మరో కీలక పదవి లభించబోతుందా? ఇందుకు బీజేపీ సహకారం అందిస్తుందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ జూన్ నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో కొత్త డిప్యూటీ ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలో నెగ్గడం బీజేపీకి అంత సులువు కాదు. రాజ్యసభలో బలం లేని బీజేపీ డిప్యూటీ ఛైర్మన్ పదవిపై వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో విపక్షాలలో ఐక్యత బలపడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత, ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల తర్వాత విపక్షాలు మరింత ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి డిప్యూటీ ఛైర్మన్ పదవికి పోటీకి నిలబెట్టి విజయం సాధించడం అంత ఈజీకాదు. పైగా ఎన్డీఏ మిత్ర పక్షాలు సయితం ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిపోగా, శివసేనదీ అదే పరిస్థితి ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నికను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థిని పోటీకి దింపి విజయం సాధించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అయితే ఇది ఎంతవరకూ సాధ్యమన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. ఇప్పటికే వైసీపీ, బీజేపీ మిలాఖత్ అయిందన్న ప్రచారం టీడీపీ చేస్తోంది. ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ ప్రచారం నిజమైనట్లే.వైసీపీ ఆ సాహసం చేయకపోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిది కూడా అదే దారి. బీజేపీతో జట్టుకట్టి డిప్యూటీ ఛైర్మన్ పదవికి పోటీకి దిగితే వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్యనాయుడు ఉన్నారు. మరో తెలుగు వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టడం కూడా సరికాదు. అందుకని ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం కష్టమే. బీజేపీకి మాత్రం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక కత్తిమీద సామే అవుతుంది.

Related Posts