మెదక్, నవంబర్ 28,
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ.. క్యాడర్ ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్ తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రోజు నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీక్షా దివస్ కు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది.మరో నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా చురుగ్గా వ్యవహరించాలంటే పార్టీ కేడర్ ను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు మొదలు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని ప్రారంభించినా.. నిర్వహణ లోపంతో అవి నామ మాత్రంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వాటన్నింటిని యాక్టివేట్ చేయాలనే వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్.ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది. దీక్షా దివస్ ను ఇప్పుడు కేంద్ర స్థాయిలో కేడర్ ను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలను పార్టీ నిర్వహించబోతోంది.
* క్యాడర్ ను యాక్టివేట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు
* ఈ నెల 29న దీక్షా దివస్ తో డోస్ పెంచాలని వ్యూహాలు
* జిల్లాలకు ఇంచార్జ్ లను నియమించిన బీఆర్ఎస్ అధిష్టానం
* ఈ నెల 26న జిల్లా ఆఫీసుల్లో కార్యకర్తలతో ఇంఛార్జ్ ల మీటింగ్
* దీక్షా దివస్ రోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం
* జిల్లాల ఆఫీసుల్లో వరుసగా పార్టీ కార్యక్రమాలకు ప్లాన్
* డిసెంబర్ 9న మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
* తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయం