ఎన్డీఏ నుంచి విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్ర బాబును ఎలాగైనా పడగొట్టాలనే కసితో బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ప్రధాని మోడీనే లక్ష్యంగా చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీకి అన్యాయం చేశారంటూ బీజేపీని దోషిని చేసేశారు. విభజన నష్టాల నుంచి గట్టెక్కిస్తామని చెప్పి.. మరింత ముంచేశారంటూ ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాక దేశవ్యాప్తంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదంటూ జోస్యం చెబుతున్నారు. మోడీ వ్యతిరేక నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అటు రాష్ట్రంలో.. ఇటు దేశంలో బీజేపీని కడిగిపారేస్తున్న బాబుపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.ఏపీలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాకూడదు.. ఇదే బీజేపీ నేతల ముందున్న అది పెద్ద లక్ష్యం!ఏపీలో బీజేపీని అథమ స్థాయికి తీసుకెళ్లి.. ఆ పార్టీపై ప్రజల్లో ఏహ్యభావం వచ్చేలా చేసిన బాబును.. దెబ్బకు దెబ్బ తీయాలనే పంతం ఎక్కువవుతోంది. అంతేగాక తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారు కమలనేతలు.జాతీయ స్థాయిలో చక్రం తిప్పి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబును.. ఢీ కొట్టడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ విషయం ఆలస్యంగా గ్రహించారు బీజేపీ నేతలు. అందుకే ఇదంత సులువైంది కాదని చేతులెత్తేశారు. మరి బాబును ఓడించేందుకు బీజేపీ ఏయే వ్యూహాలు రచించబోతోంది? ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అనే అంశాలు చర్చనీయాం శంగా మారుతున్నాయి. కింకర్తవ్యంపై కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారట. టార్గెట్ టీడీపీ కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమంటున్నారు కమలనాథులు! కానీ ఇది అంత మామూలు విషయం కాదని, ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉందంటున్నారు కమలనాధులు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము ఊహించామని… కానీ, తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమకు విడాకులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలన్న చంద్రబాబు వ్యూహం కచ్చితంగా నెరవేరుతుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనే చంద్రబాబు రాజకీయ క్రీడ మొదలు పెట్టారన్నారు.ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను, ఏపీలో టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగానూ బీజేపీ వ్యూహరచన చేస్తోంది. `ఏపీలో ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీని మాత్రం అధికారంలోకి రానివ్వబోమని, తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయం దక్కకుండా ఏమైనా చేస్తామని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏపీ రాజకీయాల్లో గేమ్ ఆడేందుకే కొత్త అధ్యక్షుడిని తీసుకొచ్చామన్నారు. ఆ రాష్ట్రంలో రాజకీయ క్రీడకు సన్నద్ధమవుతున్నామన్నారు.ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని, టీడీపీ నుంచి కూడా పలువురు సంకేతాలు పంపిస్తున్నారని అన్నారు. 1984లో ఉమ్మడి ఏపీలో చోటుచేసుకున్న సంక్షోభమే 2019లోనూ పునరావృతం అవుతుందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపితే.. తెలంగాణలో కాంగ్రెస్ మునుగుతుందన్నారు. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో చంద్రబాబును ఏపీలో అధికారంలోకి రాకుండా చేసేందుకు బీజేపీ వేస్తోన్న ఎత్తులు మామూలుగా లేవు. ఆ పార్టీ ఇందుకోసం స్థానికంగా బలంగా ఉన్న రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందా ? లేదా ? ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరేలా తెరవెనక పాత్ర పోషిస్తుందా ? అన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.