విజయనగరం, నవంబర్ 29,
ఎచ్చెర్ల టీడీపీ నేతలు పదవుల్లో ప్రాధాన్యం కోసం చూస్తున్నారు. నవ్యాంధ్రలో టీడీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాలంలో (2014-19 )లో ఇక్కడి శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఇంధన శాఖా మంత్రిని చేసి గౌరవించారు. అలాగే చౌదరి బాబ్జీ సతీమణి ధనలక్ష్మికి జడ్పీ పీఠాన్ని కేటాయించారు.ఇంతకు మించి ఆ కాలంలో కూడా పెద్దగా పదవులేమీ రాలేదు.1983-2004 టీడీపీ ఆవిర్భావం నుంచి ఎచ్చెర్లకు పదవులు వరించడంలో స్వర్ణ యుగమేనని చెప్పాలి. 1983 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కావలి ప్రతిభాభారతికి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. అలాగే ఆమె స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే డీసీఎంఎస్ ఛైర్మన్ గా డి. సత్యేంద్రవర్మ వ్యవహరించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా చౌదరి బాబ్జీ వ్యవహరించారు.విజయనగరం ఎంపీ టిక్కెట్‌ను ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి ఇచ్చి గెలిపించుకోవడంతో పార్టీ కోసం పనిచేసేవారికి అందలమెక్కిస్తారని రుజువైంది. అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన పార్టీ శ్రేణులు తమకు ప్రాధాన్యత ఉంటుందని ఎంతో ఆశించారు. పదవుల పందేరంలో ఎచ్చెర్లకు అగ్ర తాంబూలం ఉంటుదని అంతా భావించారు. ఇప్పటి వరకు కేవలం రెండు కార్పోరేషన్ డైరెక్టర్ పదవులతో సరిపెట్టారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా సీనియర్ న్యాయవాది అన్నెపు భవనేశ్వరరావుకు, రణస్థలం మండలానికి చెందిన గురజాల రాముకు రజక కార్పోరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తికి డైరెక్టర్ పదవిని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. జిల్లా స్థాయి పదవులు చేపట్టినా ఎలాంటి ప్రాధాన్యం లేని డైరెక్టర్ పదవి ప్రకటించడంతో పార్టీలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. ఎచ్చెర్లలో కూటమిలో భాగంగా బిజెపి నుండి ఈశ్వరరావును ఎంపిక చేయగా మెజార్టీతో గెలవడం జరిగింది. టిడిపి నుండి ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ అనేది ఉందని అయితే వాళ్ల వల్ల టిడిపి కార్యకర్తలు తీవ్రంగా నలిగిపోతున్నారని అంటున్నారు. బిజెపి కూటమి ఎమ్మెల్యే అయిన దగ్గరికి వెళ్తే ఏ పని అవటం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగని ఎంపీ పూర్తిస్థాయిలో చేయగలుగుతారంటే చేయలేని పరిస్థితి ఉందని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని గెలిపించుకొని చేసిన చివరికి మాత్రం మా పరిస్థితి ధైర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జిల్లా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న గొర్లె శ్రీరాములునాయుడు ఇదే నియోజకవర్గం నుంచే రాజకీయాలు నెరిపారు. జడ్పీ చైర్మన్ గా, డీసీసీబీ ఛైర్మన్ గా, ఎంఎల్ సీ గా, మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీసీసీ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేసి, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా అన్ని పార్టీల మద్దతుతో ఎంఎల్సీగా ఎన్నికైన గొర్లె హరిబాబునాయుడు కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇంతటి రాజకీయ వైభవం గల ఎచ్చెర్లకు ఎందుచేతనో మరి పాలకుల చిన్న చూపునకు గురవుతున్నట్టుగా అనిపిస్తుంది.గతమెంతో ఘనకీర్తి, మనకెందుకీ అపకీర్తి అన్నట్టుగా పార్టీ క్యాడర్ అంతర్మథనం చెందుతున్నారు. ఇకనైనా పదవుల పంపకంలో ఎచ్చెర్లకు సముచిత స్థానం కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు