కాకినాడ, విజయవాడ, నవంబర్ 29,
జనసేనాని పవన్ కల్యాణ్ తన టార్గెట్ పెంచారు. రాష్ట్ర స్థాయినేత నుంచి జాతీయస్థాయి పొలిటిషయన్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తానని పాలిటిక్స్‌లో అడుగు పెట్టిన పవన్ పదేళ్లలోపే ఒక రాష్ట్రనికి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. 2014 నుంచి జన సేనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ మొదట్లో ఎదురు దెబ్బలే తిన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. ఆయన్ని వైసిపి నేతలు గత ఐదేళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌లో డిజాస్టర్‌గా ట్రోలింగ్ ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలు వచ్చేసరికి విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటమిలో గేమ్ చేంజర్ పాత్ర పోషించింది పవనే. అంతేకాకుండా ఎడమొఖం పెడముఖంగా ఉన్న బీజేపీ టిడిపిని ఏకతాటిపైకి తెచ్చింది ఆయనే. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ప్రభావాన్ని గుర్తించిన బీజేపీ ఆయనను తెలుగు వాళ్ళ ప్రభావం ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం కోసం వాడుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో పవన్ ఆలోచనలు మరో విధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి 2024 ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌కు తోడు ఇటీవల మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన 11సీట్లలో ఏకంగా 10సీట్లు బీజేపీ కూటమి గెలుచుకుంది. దీంతో నేషనల్ లెవెల్‌లో పవన్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఆపై ఏడాది వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పవన్‌తో ప్రచారం చేయించే ఆలోచనలో బిజెపి ఉంది. అలాగే స్థానిక నేతలను జనసేనలో చేర్పించి వారితో పోటీ కొన్ని స్థానాల్లో చేయించే ఆలోచన జనసేన చేస్తోంది. ఢిల్లీ తమిళనాడు రాష్ట్రాల్లో అలాంటి స్థానాలు అంటే తెలుగు ఓటర్ల డామినేషన్ ఉన్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి చోట్ల జనసేన పోటీలోకి దిగితే ఎలా ఉంటుందని ఆలోచన జనసేన పెద్దలు చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల వరకు పవన్ కల్యాణ్ మీద ఒక ముద్ర ఉండేది. అందరితో కలవరని బిడియం బాగా ఎక్కువ అని జనసేన నేతలే చెప్పుకునేవారు. అయితే ఇటీవల విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ పవన్ వ్యవహార శైలిని మార్చేసింది. దీనికి తోడు పవన్ కల్యాణ్‌కు వివిధ భాషలపై ఉన్న పట్టు కూడా ఆయన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తుందని అంటారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్లు కేవలం మాతృ భాషతో లేదా ఇంగ్లీష్‌తో మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు హిందీపై ఉన్న పట్టు కూడా కలిసి వస్తుందని అంటారు. మూడు రోజులపాటు ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతోపాటుగా వారందరికీ తాజ్ హోటల్‌లో ఒక విందు కూడా ఏర్పాటు చేశారు పవన్.కేంద్ర మంత్రులతోపాటు కూటమి ఎంపీలు, పలువురు జాతీయ స్థాయి నేతలు ఈ విందుకు హాజరయ్యారు. ఆ విందు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తున్న పొలిటికల్ ఎనలిస్టులు పవన్ వ్యవహార శైలిలో వచ్చిన మార్పును విశ్లేషిస్తున్నారు. ఒక జాతీయస్థాయి నేతకు ఉండాల్సిన లక్షణాలను పవన్ అలవర్చుకున్నారని రానున్న రోజుల్లో దాని ప్రభావం కచ్చితంగా నేషనల్ పాలిటిక్స్‌లో కనిపిస్తుంది అని అంచనాలు వేస్తున్నారు. మరి వారి అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో చూడాలి.